కరీంనగర్ తెలంగాణచౌక్, డిసెంబర్ 2: కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 42 % రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట నిరసన చేయడానికి యత్నించగా, వన్ టౌన్ పోలీసులు అడ్డుకొని నాయకులను ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తవుతున్నా ఇప్పటివరకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా జీవోలు, కోర్టు కేసులతో కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు.
సర్పంచ్ ఎన్నికల ప్రచారం కోసం నేడు హుస్నాబాద్‌కు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని ఉమ్మడి జిల్లా బీసీ సంఘాలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. క్యాబినెట్లో ఉన్న బీసీ మంత్రులు రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఓట్ల కోసం బీసీలను వాడుకుని, అధికార పీఠం ఎక్కిన తర్వాత విస్మరిస్తున్నారని విమర్శించారు. సీఎం సభను అడ్డుకోవడానికి బీసీలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.