హనుమకొండ, డిసెంబర్ 28 : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు ఎదుట బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో అగ్రకులాలు తమకు రావాల్సిన వాటా కన్నా ఎక్కువ పొందుతున్నారని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆశ చూపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ నాయకులు మధుసూదనాచారికి కృతజ్ఞతలు తెలిపారు. దీక్ష చేస్తున్న నాయకులకు మధుసూదనాచారి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.