KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : కులగణన సర్వే తప్పుల తడకగా ఉన్నదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీయే ఈ నివేదికను తగలబెట్టాలని పిలుపునిస్తున్నారని ఉదహరించారు. కులగణన సర్వే నివేదికపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడారు. కుల గణన సర్వేను ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి, ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నదంటే కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రత్యేక బిల్లు తెస్తున్నారేమోనని భావించామని చెప్పారు. బిల్లును శాసనసభలో ఆమోదింపజేసి చట్టబద్ధత కల్పిస్తారమోనని బలహీన వర్గాలకు చెందిన వారు ఆసక్తిగా ఎదురు చూశారన్నారు. కానీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తామని ప్రకటించినప్పుడు ఎవరికిపడితే వారికి వ్యక్తిగత సమాచారం ఇచ్చేస్తారా? అని రేవంత్‌రెడ్డి చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆయన చెప్పిన మాటల వీడియోలనే ప్రజలు ఎన్యుమరేటర్లకు చూపించారని, ‘57 రకాల ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు?
మా వ్యక్తిగత సమచారం ఎందుకు ఇవ్వాలి?’ అని ప్రజలు ఎన్యుమరేటర్లను ప్రశ్నించారన్నారు. 2014లో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినప్పుడు కూడా శాంతికుమారి, రామకృష్ణారావు, సందీప్ కుమార్ సుల్తానియా అధికారులుగా ఉన్నారని చెప్పారు. తొమ్మిదేన్నరేళ్లు తాను మంత్రిగా పనిచేశానని, వారితో ప్రభుత్వమే సర్వే చేయించిందని స్పష్టం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే అధికారిక డాక్యుమెంట్ అని పారదర్శకత కోసం వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. ఆనాడు ఒక్కరోజే కోటీ 3 లక్షల 95 వేల కుటుంబాలు, 3.68 కోట్ల మంది ప్రజలు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారని గుర్తుచేశారు. అందులో బీసీల సంఖ్య 1,85,61,850 అని, జనాభాలో బీసీలు 51 శాతం ఉన్నారన్నారు. మైనార్టీల్లో ఉన్న బీసీలు 10 శాతం కలిపి మొత్తం 61 శాతం అని వెల్లడించారు. సమగ్ర కుటుంబ సర్వేలో 1.85 కోట్లు ఉన్న జనాభా ఇప్పుడు 1.64 కోట్లకు ఎలా తగ్గిందని ప్రశ్నించారు. 51 శాతం ఉన్న తమ జనాభా 46 శాతానికి ఎలా తగ్గిందని బీసీలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. శాసనసభ ప్రత్యేక సమావేశాలు అని చెప్పి.. ప్రభుత్వం కొత్తగా చెప్పిందేమీ లేదని, ఇటీవల మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పిన గణాంకాలనే అసెంబ్లీలో వెల్లడించారని ఎద్దేవా చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, సబ్‌ప్లాన్ తెస్తారని తాము భావించామని, కానీ ఇవేమీ లేకుండా ఒక పత్రాన్ని అసెంబ్లీకి తెచ్చి, చరిత్ర సృష్టించామని చెప్పుకొంటే ఎలా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘కాంగ్రెస్ అంటే.. కూల్చివేతలు, కాల్చివేతలు, అణచివేతలు, ఆక్రమణలు, అరెస్టులు, జైళ్లు, నిర్భంధం, నియంతృత్వం’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదల వేదన, అరణ్య రోదనగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘కట్టుకున్న గూడు కండ్ల ముందే కూలితే, రెకల కష్టం రెప్పపాటులో ఒరిగిపోతే, కంటికిరెప్పలా కాపాడాల్సిన సరారు కాళ్ల కింద కరశంగా నలిపేస్తుంటే ఇది ప్రజాపాలన అంటారా? ప్రతీకార పాలన అంటారా? ఇది ఇందిరమ్మ రాజ్య మా? ఇది ఎమర్జెన్సీ పాలనా?’ అని మంగళవారం ఎక్స్ వేదికగా నిలదీశారు. ‘జాగో తెలంగాణ జాగో’ అని పిలుపునిచ్చారు. హైడ్రా బుల్డోజర్ తన ఇంటిని కూల్చివేస్తుంటే, పోలీసుల నిర్బంధంలో ఓ వృద్ధుడు దీనంగా రోదిస్తున్న వీడియోను ఈ సందర్భంగా కేటీఆర్ పోస్టు చేశారు.