ఖైరతాబాద్, ఆగస్టు 16: బీసీ కులగణన, 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఆమరణ దీక్ష చేపడుతామని బీసీ సంఘాల నాయకులు స్పష్టంచేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ కుల, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ మాట్లాడారు. కా మారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలని వారు డిమాండ్ చేశారు. కులగణన చేయకుండా ప్రభుత్వం సాకులు చెబితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. తన ఆరోగ్యం బాగాలేకున్నా సామూహిక ఆమరణ దీక్షలో పాల్గొంటానని చెప్పా రు. అధికార పార్టీలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు సమగ్ర కులగణనపై ఆయా పార్టీలపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉన్నదని హితవు పలికారు. 42 మంది బీసీ నేతలతో సామూహిక ఆమరణ దీక్ష చేపడుతామని చెప్పారు.