హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) ప్రచారం సందడిగా సాగుతున్నది. రెండో విడత (Second Phase) 415 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. తొలి విడత ఎన్నికలకు మంగళవారంతో ప్రచారం ముగియనున్నది. ఆఖరి విడత ఎన్నికలకు మంగళవారమే నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరిరోజు. అదేరోజు సా యంత్రం నుంచే ప్రచారం షురూ కానున్నది. తొలి విడత పంచాయతీ పోలింగ్ 11న జరుగనున్నది. రెండో విడత ఎన్నికలకు శనివారం సాయంత్రమే ప్రచారం మొదలైంది. 12న శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనున్నది. వీరి ప్రచారానికి కేవలం 5 రోజుల గడువు మాత్రమే ఉన్నది. పోలింగ్ 14న జరుగుతుంది. మూడో విడత పోలింగ్ 17న జరుగతుంది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. కుటుంబాలవారీగా కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. యువతకు క్రికెట్లు కిట్లు, మహిళా సంఘాలకు, గుంపు మేస్త్రీలకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకొని వారి ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. బయటి ప్రాంతాల్లో ఉండే వారికి రవాణా సదుపాయం, ఇతర ఖర్చులు చూసుకుంటామని అభ్యర్థులు భరోసా ఇస్తున్నారు. తొలి విడతతో 3,836 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనుండగా, 13,127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సుమారు అన్ని గ్రామాల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది.
రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థుల ప్రచారం ఊపందుకున్నది. శనివారం సాయంత్రం మొదలైన వీరి ప్రచారం.. ఆదివారం కూడా ఉత్సాహంగా సా గింది. అభ్యర్థులు తమ గుర్తులతో ఇంటింటికీ తిరుగుతూ తమ ఎజెండాను ఓటర్లకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు త్రిముఖ పోటీ, వార్డు సభ్యులకు ద్విముఖ పోటీ ఉన్నట్టు ఎస్ఈసీ గణాంకాలను బట్టి తెలుస్తున్నది.
చివరి విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్నది. ఆ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. అదే రోజు అభ్యర్థులకు గుర్తులనూ కేటాయిస్తారు. ఆ మరుక్షణమే అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభిస్తారు. వారం రోజుల ప్రచారం అనంతరం 15న సాయంత్రంతో వారి ప్రచారం ముగిస్తుంది. 17న ఉదయం 7 నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. చివరి విడతలో 4,158 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడదల చేయగా, 11 సర్పంచ్ స్థానాలకు, 100 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 27,277 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 36,442 వార్డులకు 89,603 నామినేషన్లు దాఖలయ్యాయి.
హసన్‌పర్తి, డిసెంబర్ 7: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం జయగిరిలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేస్తే రూ.50 లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తానని ఓ అభ్యర్థి చెప్పగా, మిగతా వారు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకునేందుకు అంగీకరించారు. చివరికి ఓ అభ్యర్థి హ్యాండివ్వడం చర్చనీయాంశమైంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలో సర్పంచ్ స్థానానికి ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో తాళ్లపెల్లి వెంకటేశ్వర్లు (అడ్వకేట్) గ్రామంలోని పోచమ్మ, కనకదుర్గమ్మ ఆలయాల నిర్మాణం, వాటర్ ప్లాంట్, గ్రామంలో కోతుల బెడద, హెల్త్ సెంటర్ నిర్మాణానికి రూ.50 లక్షలు సొంతంగా ఇస్తానని ప్రకటించారు. దీంతో మిగిలిన ఏడుగురు అభ్యర్థులు ఆంజనేయస్వామి ఆలయంలో అంగీకరించి నామినేషన్లను వెనక్కి తీసుకుంటామని గ్రామస్థుల మధ్య హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నామినేషన్లను విత్ డ్రా చేసుకొని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అయితే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పల్లె దయాకర్ చివరి క్షణంలో ప్లేటు ఫిరాయించాడు. దీంతో సర్పంచ్ అభ్యర్థులు తాళ్లపెళ్లి వెంకటేశ్‌కు మద్దతు పలికారు.