చెట్లను నరికేందుకు అటవీ శాఖ అనుమతి, అందుకు దరఖాస్తు తప్పనిసరన్న జీవో 23 రెండు హెక్టార్ల విస్తీర్ణం దాటితే కచ్చితంగా అడవిని ముందస్తు మదింపు చేయాల్సిందే అడవి నుంచి నెమలి గుడ్డును తీసుకువెళ్లినా నేరమేనంటున్న వన్యప్రాణి రక్షణ చట్టం వర్సిటీలో వందల నెమళ్ల్ల ఆవాసాల ధ్వంసం
అటవీ, వన్యప్రాణి, వాల్టా చట్టాలను తుంగలో తొక్కిన రేవంత్‌రెడ్డి సర్కారు అడవి కాదంటూ అటవీ శాఖ నివేదికతో తప్పుదోవ పట్టించేందుకు యత్నం భూమి సర్కారుదని దౌర్జన్యంగా బోర్డులు
– గుండాల కృష్ణ-వర్ధెల్లి వెంకటేశ్వర్లు
HCU | హైదరాబాద్/సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలోని 400 ఎకరాల విస్తీర్ణంలోని అడవిని మాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. అధికారిక నివేదికల్లో అక్కడ అసలు అడవే లేదని భ్రమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నది. కానీ దాచేస్తే దాగేందుకు అక్కడేవో రెండు పిల్ల మొక్కలు లేవు.. వందల ఎకరాల విస్తీర్ణంలో అరుదైన జీవవైవిధ్యంతో వేలాది చెట్లు, వందలాది జంతుజలాన్ని ఒడిలో పెట్టుకున్న అడవి తల్లి కనిపిస్తున్నది. అయితే అది అడవే కాదంటూ కొందరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు.
రాజకీయ నేతలు వేరు.. కానీ చట్టాలను రూపొందించే ప్రజాప్రతినిధులు! చట్టాలను అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఈ వాదన చేయడం ఇప్పుడు జాతీయస్థాయిలో తెలంగాణకు అప్రతిష్ఠను తీసుకువస్తున్నది. అది ప్రైవేటు భూమిగానీ.. సర్కారు జాగాగానీ… కనీసం పది హెక్టార్లకు మించిన విస్తీర్ణంలో చెట్లు విస్తరిస్తే అది అడవేనని సుప్రీంకోర్టు గోదావర్మన్ తిరుముల్క్పాడ్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో నిర్వచనం ఇచ్చింది. రెండు హెక్టార్లకు మించిన స్థలంలో చెట్లు ఉంటే వాటిని ముట్టుకోవాలన్నా అటవీ శాఖ అనుమతి తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వమే గతంలో ఉత్తర్వులు జారీచేసింది.
ఉన్న భూమిలో పది శాతం విస్తీర్ణంలో నీడనిచ్చే చెట్లు ఉంటే కచ్చితంగా దానిని అడవిగా పరిగణించాలంటూ ఫ్రాన్స్‌లో 2019లో జరిగిన కాప్ సదస్సులో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం స్పష్టం చేస్తున్నది. ఇక.. మన జాతీయ పక్షి నెమలి గుడ్డును చిదిమినా కనీసంగా మూడేండ్ల పాటు కటకటాలు లెక్కించాల్సిందేనని వన్యప్రాణి చట్టాలు హెచ్చరిస్తున్నాయి. మరి.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒకటీ అరా కాదు! 400 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన చెట్లు, అరుదైన జీవజాలం ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వమే దానిని అడవి కాదంటున్నది.
చట్టాలను తుంగలో తొక్కి వందల ఎకరాల్లో అడవిని ధ్వంసం చేయడంతో పాటు యథేచ్ఛగా వన్యప్రాణి చట్టాలను ఉల్లంఘించి మూగజీవాల ఉసురు తీసుకుంది. పైపెచ్చు.. సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ గురువారం హెచ్‌సీయూ భూముల్ని పరిశీలించేందుకు వస్తున్న దరిమిలా 400 ఎకరాల్లో అసలు అడవేలేదనే నివేదికలు రూపొందించి తప్పుదోవ పట్టించేందుకు పన్నాగం పన్నుతున్నది. ఈ నేపథ్యంలో అసలు అడవి అంటే ఏంది? చట్టాలు ఏం చెప్తున్నాయి? న్యాయస్థానాలు ఏమి తేల్చాయి? అంతర్జాతీయ ఒప్పందాల సారాంశమేంది? అంతకుమించి వన్యప్రాణి చట్టాలు ఏమని ఘోషిస్తున్నాయి? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడింది? అనే వాస్తవాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
ఏది అటవీ ప్రాంతం? కంచ గచ్చిబౌలిలో విధ్వంసం తెరమీదికొచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న ప్రశ్న ఇదే. రేవంత్ సర్కారు 400 ఎకరాల్లో ఉన్నది అడవి కాదంటున్నది. కానీ విద్యార్థులు, పర్యావరణవేత్తలు, మేధావులు అందరూ అది అడవేనంటున్నారు. ఒక ప్రభుత్వం.. వ్యక్తులు ముఖ్యం కాదు. చట్టాలు, కోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయనేది ప్రధానం. దేశ అత్యున్నత న్యాయస్థానం 1996లో ఇచ్చిన ఉత్తర్వులు అత్యంత కీలకం. టీఎన్ గోదావర్మన్ తిరుముల్క్పాడ్ వర్సెస్ కేంద్రం కేసులో అడవికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. ఆ ఉత్తర్వుల మేరకు…
400 ఎకరాల్లో ఏముంది? అసలు అది అడవా? కాదా? అక్కడ ఏమున్నాయి? అనే దానిపై ముందుగా కనీస మదింపు (అధ్యయనం) చేయించలేదు. అటవీ శాఖను అందులో భాగస్వామ్యం చేయకుండా ఏకపక్షంగా టీజీఐఐసీతోనే ముందుకుపోయింది. ఈ క్రమంలో అటవీ, వన్యప్రాణి, వాల్టా చట్టాలను బుల్డోజర్ల కింద నలిపివేసింది.
చివరకు అంతర్జాతీయ ఒప్పందాలను పరిశీలించినా.. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు అటవీ ప్రాంతం కిందికే వస్తాయి. భారత ప్రభు త్వం కాన్ఫరెన్స్ ఆఫ్ పారిస్ (కాప్)-19లో 9-క్యోటో ప్రొటోకాల్‌పై సంతకం చేసింది. దీని ప్రకారం అటవీ ప్రాంతాన్ని గుర్తించడంలో కొన్ని ప్రమాణాలను పొందుపరిచారు. ము ఖ్యంగా క్రౌన్ కవర్ పర్సంటేజీ (కెనోపీ)ని ప్రామాణికంగా తీసుకున్నారు. కెనోపీ అంటే నీడనిచ్చే చెట్లను ప్రామాణికంగా తీసుకోవాలని అర్థం.
ఇందులో భాగంగా భారతదేశం కొన్ని ప్రమాణాలను నిర్ధారించుకుంది. దీనిప్రకారం కనీసం హెక్టారు విస్తీర్ణంలో రెండు మీటర్ల ఎత్తు ఉన్న నీడనిచ్చే చెట్లు పది శాతం వరకు ఉం డాలి. ఆ భూమి యజమాని ప్రభుత్వమైనా, ప్రైవేటు అయినా, సంస్థ అయినా సరే! దానిని అడవిగా గుర్తించాలి. ఈ క్రమంలో కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ఎన్ని భారీ చెట్లు ఉన్నాయో.. ఎంతటి అరుదైన జంతు, జీవజాలం ఉన్నదో తెలిపేందుకు అనేక నివేదికలు ఉన్నాయి. అయినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అది అడవి కాదని భ్రమింపజేసేందుకు నివేదికలు రూపొందిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి.
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి మొదలు పర్యావరణవేత్తలు, మేధావులు, దేశంలోని చట్టాలు, అంతర్జాతీయ ఒప్పందాలు అది అడవేనని చెప్తున్నాయి. మూగజీవాలు సైతం మహాప్రభో.. ఇది అడవే అంటూ జీవి విడుస్తున్నాయి. చివరకు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకున్న దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం రికార్డు ఆఫ్ ప్రొసీడింగ్స్‌లో ‘కంచ గచ్చిబౌలి ఫారెస్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ’ అని స్పష్టంగా పేర్కొన్నది. కానీ ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అది అడవి కాదని వాదిస్తున్నది.
కంచ గచ్చిబౌలి భూముల విధ్వంసాన్ని సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ భూములను ఫారెస్టుగా పేర్కొన్నది. కాగా వివాదం దరిమిలా చోటుచేసుకున్న పరిణామాల్లో భాగంగా ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సంఘటన ప్రాంతానికి వెళ్లి పరిశీలించి నివేదిక అందించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక ఇచ్చిన రిజిస్ట్రార్ అందులో ‘అటవీ ఆవాసం’ అని పొందుపరచడం అది అడివేనని అనడానికి మరో సాక్ష్యం. నెమళ్లు, జింకలు, పక్షులకు ఆవాసమైన 100 ఎకరాలు ధ్వంసం చేసినట్టు నివేదికలో పేర్కొనడం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వివాదాస్పద భూమలుల్లోకి ప్రవేశించి అక్రమంగా సైన్ బోర్డులు పాతింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్టరాదని సుప్రీంకోర్టు స్టే విధించింది. వాస్తవ పరిస్థితిని పరిశీలించి, నిజ నిర్ధారణతో నివేదిక ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ గురువారం హైదరాబాద్ రానుంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. బుధవారం మధ్యాహ్నం వివాదాస్పద భూముల్లోకి వెళ్లిన రెవిన్యూ అధికారులు ‘ఈ భూమి టీజీఐఐసీ లిమిటెడ్‌కు చెందినది’ అని బోర్డులు పాతారు. జీవో ఎమ్మెస్ నంబర్ 54, తేదీ 26/06/ 2024, రెవెన్యూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని బోర్డుపై పేర్కొన్నారు. ఎంపవర్డ్ కమిటీని తప్పుదోవ పట్టించటానికే అధికారులు సైన్ బోర్డులు పాతినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఇవే భూముల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పథకం కింద దాదాపు 5 లక్షలకు పైగా మొక్కలు నాటినట్టు అటవీ శాఖ నివేదికలు చెప్తున్నాయి. టేకు, వేప, అల్లనేరెడు, రావి, జువ్వి చెట్లు విస్తారంగా పెంచినట్టు రికార్డులు చెప్తున్నాయి. తొలిదశ, మలిదశలో నాటిన చెట్లు పెరిగి పెద్దవయ్యాయని హెచ్‌సీయూ విద్యార్థులు చెప్తున్నారు. ఈ చెట్లు అన్ని కూడా 1969 తెలంగాణ అటవీ చట్టం పరిధిలోకి వచ్చే వృక్ష జాతులే. ఈ చెట్లను ఎలాంటి అనుమతి లేకుండా రాత్రికి రాత్రే నరికివేసినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
జింకలు మెడో ైక్లెమేట్ను అమితంగా ఇష్టపడుతాయని, దుప్పులు, నెమళ్లు ఇష్టంగా పెరుగుతాయని జంతు పరిశోధకులు చెప్తున్నారు. తుప్పతో కూడిన ఖాళీ భూమి, స్క్రబ్ అడవి, గడ్డి భూములు, నీటి కుంటలు కలిసి ఉన్న ప్రాంతాన్ని మెడోైక్లెమేట్ అంటారు. కంచ గచ్చిబౌలి భూములు అద్భుతమైన మెడోైక్లెమేట్ ఉన్న ఆవాసమని అటవీ శాఖ రిటైర్డ్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మేత మేయటానికి, తిరగటానికి, సంతానోత్పత్తికి ఇటువంటి ఆవాసం అనువుగా ఉంటుందని ఆయన వివరించారు. తాను సర్వీస్‌లో ఉన్నప్పుడు ఈ భూముల్లో మచ్చల జింకలు, దుప్పులు చూశానని ఇప్పుడు వాటి సంతతి ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఇక్కడ జింకలు లేవని వాదించటం మూర్ఖత్వమే అవుతుందన్నారు.
సాధారణంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారానికో, గుర్తుకు వచ్చినపుడో, ఇంకో సందర్భంలో మాత్రమే మొక్కలు నాటడంపై దృష్టి సారిస్తాయి. కానీ ఏటా మొక్కలు నాటడాన్ని ఓ యజ్ఞంలా చేపట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించింది. పదేండ్లలో దాదాపు 230 కోట్లకు పైగా మొక్కలను నాటడంతో పచ్చదనం పెంపులో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు కఠినమైన నిబంధనల్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం రూపొందించింది. అందుకు జూలై 5, 2017న తీసుకువచ్చిన జీవో 23 నిదర్శనం. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఇష్టానుసారంగా చెట్లను నరికివేయొద్దనే సదుద్దేశంతో అటవీ పరిరక్షణ చట్టం-1980, సుప్రీంకోర్టు ఉత్తర్వులు-1995, వాల్టా చట్టం-2002, 2004.. ఇలా అన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని కేసీఆర్ ప్రభుత్వం నిబంధనల్ని రూపొందించింది. కానీ హెచ్‌సీయూ విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జీవో 23 నిబంధనల్ని తుంగలో తొక్కింది. పైగా జీవో ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖనే బాధ్యత మరిచి అది అడవి కాదని భ్రమింపజేసేందుకు నానా తంటాలు పడుతున్నది.
ఉన్న భూమిలో పది శాతం విస్తీర్ణంలో నీడనిచ్చే చెట్లు ఉంటే కచ్చితంగా దానిని అడవిగా పరిగణించాలంటూ అంతర్జాతీయ ఒప్పందాలు చెబుతున్నాయి.
వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీం తీర్పు అది ప్రైవేటు భూమిగాని… సర్కారు జాగా గాని… కనీసంగా పది హెక్టార్లకు మించిన విస్తీర్ణంలో చెట్లు విస్తరిస్తే అది అడవి అన్నది సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు.
కనీసంగా రెండు హెక్టార్లకు మించిన స్థలంలో చెట్లు ఉంటే వాటిని ముట్టుకోవాలన్నా అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. ఇది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 23 సారాంశం.
వన్యప్రాణి ఒప్పందం- 1972 ప్రకారం
ఇక… మన జాతీయ పక్షి నెమలిని కాదు; దాని గుడ్డును చిదిమినా కనీసంగా మూడేండ్ల పాటు కటకటాలు లెక్కించాల్సిందేనని వన్యప్రాణి చట్టాలు హెచ్చరిస్తున్నాయి.