హైదరాబాద్, మే 26(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పాలనలో సిరులగనిగా ఉన్న సింగరేణి, కాంగ్రెస్ పాలనలో సింగరేణి సామ్లా గనిగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. 40లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నట్టు సింగరేణి అధికారిక వెబ్సైట్ చూపిస్తున్నదని, దాని నుంచి ఆదాయం వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ కట్టారని తెలిపారు. రూ.1,600 కోట్ల విలువైన బొగ్గు స్టార్ వెబ్సైట్ రికార్డు ప్రకారం ఏడు గనుల వద్ద లేదని, మరి ఎకడున్నదో ఆ శాఖ మంత్రి భట్టి విక్రమార్క చూపించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షాన్ని గనుల వద్దకు తీసుకెళ్ల్లి ఆ బొగ్గు స్టాక్ చూపించాలని, తన ఆరోపణలు తప్పు అయితే, క్షమాపణ కోరుతానని, ఒకవేళ అక్కడ బొగ్గు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
తెలంగాణ భవన్లో మంగళవారం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలోని ఏడు ఏరియాల్లో ఏప్రిల్ 30నాటికి 40లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు సింగరేణి వెబ్సైట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. ఆ బొగ్గు నిల్వపై కోల్ సెస్, ఇన్‌కం టాక్స్ కట్టామని, కార్మికులకు లాభాల్లో వాటా, సీఎస్ఆర్ ఫండ్ చెల్లించామని, అన్ని రకాల నిబంధనలు పాటించినట్టు చెప్తున్నారని గుర్తుచేశారు. మరి రూ.1,600 కోట్ల విలువైన బొగ్గు ఎక్కడ పోయిందని, ఎక్కడ దాచిపెట్టారో చూపించాలని టీబీజీకేఎస్ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
ఆనాడు చంద్రబాబు సింగరేణిలో ఉద్యోగాలు తీసేస్తే కేసీఆర్ 19వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి జీవం పోశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఉద్యోగాలు ఇవ్వడం బీఆర్ఎస్ పని అయితే, ఉన్న ఉద్యోగాలను తొలగించడం కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. 2014లో సింగరేణికి రూ.2వేల కోట్ల బకాయి మాత్రమే ఉండగా, ఆ తర్వాత టీఎస్ జెనో నుంచి సింగరేణికి రూ.7వేల కోట్ల బకాయి ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో రూ.21 వేలకోట్ల బకాయిలు పెరిగిపోయాయని చెప్పారు. కరెంట్ విషయంలో సింగరేణికి ఇంకా రూ.20 వేల కోట్ల బకాయి పెండింగ్‌లో ఉన్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఓవర్ డ్యూస్(ఓడీ) రూ.3,200 కోట్లు మాత్రమే ఉండగా, సింగరేణికి మాత్రం ఓడీ రూ.4 వేల కోట్లు ఉన్నదని చెప్పారు. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాల్సిన సింగరేణి ఈ రోజు ఓవర్ డ్యూస్లోకి పడిపోయిందని విమర్శించారు.
ఎన్టీపీసీ అత్యంత తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధమైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాజస్థాన్‌తో కలిసి పాకిస్థాన్ సరిహద్దు జైసల్మేర్‌లో సింగరేణితో సోలార్ పవర్‌ప్లాంట్ పెట్టేందుకు సిద్ధమయ్యారని, పీపీఏ, డీపీఆర్ అప్రూవల్ కాకుండానే సివిల్ పనులు ప్రారంభించారని విమర్శించారు. థర్మల్ పవర్‌ప్లాంట్ ఆలస్యమయ్యేకొద్దీ కోట్లల్లో నష్టం వస్తుందని హెచ్చరించారు. సోలార్ ప్లాంట్ టెండర్లో మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టి, కమీషన్లు దండుకుంటున్నారని, ఫుట్‌బాల్ సోకుల కోసం సింగరేణి డబ్బులు రేవంత్‌రెడ్డి వాడుకున్నారని ఆరోపించారు. బంగారు బాతు వంటి సింగరేణిని కాంగ్రెస్ సర్కార్ అప్పులకుప్పగా మార్చిందని మండిపడ్డారు.
తెలంగాణలో నాలుగు మిలియన్ టన్నుల బొగ్గు ఎకడున్నదో ఆధారాలు చూపాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి మంత్రి కిషన్‌రెడ్డికి డిమాండ్ చేశారు. బొగ్గు గనుల్లో అవినీతి జరుగుతున్నదని బీఆర్ఎస్ లేవనెత్తితే కేంద్రం ఒక కమిటీ వేసిందని, కమిటీ ఏం తేల్చిందో పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హఠావో-సింగరేణి బచావో అనేది బొగ్గు గని కార్మికుల నినాదం కావాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. పరిస్థితి ఇలాగే ఉంటే సింగరేణిలో కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని, త్వరలో సింగరేణికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలు మరిన్నింటినీ బయటపెడుతానని హెచ్చరించారు.
కేసీఆర్ పదేండ్ల పాలన సింగరేణి సంస్థకు, కార్మికులకు స్వర్ణయుగమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అభివర్ణించారు. సింగరేణిని కేసీఆర్ పాలనకు ముందు, కేసీఆర్ హయాం, ప్రస్తుత దుస్థితి.. ఇలా గమనిస్తే కార్మిక సంక్షేమానికి కేసీఆర్ చేసిన కృషి బోధపడుతుందని చెప్పారు. వయో పరిమితి పెంపు, బోనస్, సంక్షేమ, ఇతర వసతుల విషయంలో కేసీఆర్ కార్మిక పక్షపాతిగా ఉన్నారని గుర్తుచేశారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
నికర లాభాలతో కార్మిక సంక్షేమంలో అగ్రగామిగా ఉన్న సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలో భ్రష్టు పట్టించిందని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దుయ్యబట్టారు. రెండేండ్ల క్రితం జరిగిన యూనియన్ ఎన్నికల్లో 40కిపైగా బూటకపు హామీలను ఇచ్చిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కాలపరిమితి ముగుస్తున్నా ఏ ఒక హామీనీ నెరవేర్చక కార్మికులకు తీరని ద్రోహం చేశాయన్నాయని విమర్శించారు. సింగరేణిలో అవినీతి పెచ్చుమీరడంతో కనీసం జీతాలకు సైతం అప్పులు తీసుకోవాల్సిన దుస్థితికి వచ్చిందని, ఈ పరిస్థితుల్లో యావత్ తెలంగాణ సింగరేణి కార్మిక లోకం కేసీఆర్‌ను, గులాబీ సంఘాన్ని కోరుకుంటుందని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. రెగ్యులర్ మెడికల్ బోర్డులు నిర్వహించాలని, లేకపోతే వచ్చే నెలలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
సింగరేణి కార్మికులు పక్షాన వారి సమస్యలు, హక్కుల సాధనకు టీబీజీకేఎస్ నాయకులు కొట్లాడాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలో 16వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఇండ్లు కట్టుకునేందుకు ఇండ్ల పట్టాలు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో స్కామ్‌లు తప్ప స్కీములు లేవని ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చే కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయఢంకా మోగించాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, రేగా కాంతారావు, పుట్ట మధూకర్, కోరుకంటి చందర్, హరిప్రియానాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, వరింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, జనరల్ సెక్రటరీ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నూనె కొమురయ్య, సంపత్‌కుమార్, కోశాధికారి చెల్పూరి సతీశ్, 11 డివిజన్ల ఉపాధ్యక్షులు, కేంద్ర కమిటీ నాయకులు పాల్గొన్నారు.
మందమర్రి : 7,20,000
శ్రీరాంపూర్ : 8,00,000
రామగుండం-1 : 6,00,000
రామగుండం-1 : 4,00,000
భూపాలపల్లి : 5,40,000
ఇల్లందు : 3,50,000
సత్తుపల్లి : 2,00,000