న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలపై సీవోటర్ ఆకస్మిక సర్వే నిర్వహించింది. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వ తీరు పట్ల సగానికి పైగా ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారని ఈ పోలింగ్ ఏజెన్సీ ఆదివారం వెల్లడించింది. ఇందులో 40 శాతం మందికి పైగా ఎన్డీఏ ఓటర్లు ఉన్నట్టు ప్రకటించింది. అలాగే విపక్ష నేత రాహుల్ గాంధీ కన్నా ప్రజాకర్షక విషయంలో ప్రధాని మోదీ 12 శాతం ఆధిక్యంలో ఉన్నారని తెలిపింది. నీట్ ఆందోళనకారులపై ఎఫ్ఐఆర్లు ఉపసంహరించాలంటూ సీజేపీ చేసిన డిమాండ్‌పై ఓటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
జూలై 29, 30 తేదీల్లో 18 ఏండ్లు దాటిన వయోజనులపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించినట్టు సంస్థ ప్రకటించింది. ఈ సర్వేలో ప్రభుత్వంపై యువతలో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా ప్రస్ఫుటమైందని పేర్కొంది. నీట్ ఆందోళనలో విద్యార్థులపై అమానుష లాఠీచార్జ్‌పై సరైన దర్యాప్తు చేయాలని అధిక భాగం ఓటర్లు కోరుతున్నారని, ఆందోళన సందర్భంగా హింసకు పాల్పడిన వారిపై పోలీస్ చర్య ఉండాలని డిమాండ్ చేస్తున్నారని వివరించింది. నీట్ పేపర్ లీక్ అంశం రాజకీయంగా ఎన్డీఏ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసిందని తెలిపింది. అపరిమిత ఆశయాలు ఉండి, పరిమిత అడ్డంకుల అవరోధాన్ని ఎదుర్కొంటున్న యువతలో నెలకొన్న అసహనమే ఎన్డీఏ ప్రభుత్వం ముందు ఉన్న అసలైన సవాలని సీవోటరు సర్వే పేర్కొంది.