హాలియా, జూన్ 19: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తది. అవకాశం వస్తే నేనే రాష్ర్టానికి ముఖ్యమంత్రినైతా’ అని పగటి కలలు కంటున్న మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డికి సోమవారం సొంతూరు ప్రజలు షాక్ ఇచ్చారు. 40 ఏండ్లుగా జానారెడ్డి రాజకీయ ఎదుగుదలకు ఎంతో అండగా ఉన్న అనుముల గ్రామ ప్రజలు.. హాలియా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యారు.
ఈ మేరకు జానారెడ్డి సొంతూరుకు చెందిన 40 కాంగ్రెస్ కుటుంబాలు ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ.. 2018కి ముందు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి జానారెడ్డి రిగ్గింగ్‌తో గెలిచారే తప్ప ప్రజాబలంతో కాదని ఆరోపించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కే వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.