హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హెచ్చరించింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నది. కొన్ని జిల్లాల్లో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం సూచించింది.