హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే పనిగా పెట్టుకున్న రేవంత్రెడ్డి సర్కార్.. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన వెంటనే రుణాల వేట మొదలుపెట్టింది. తాజాగా మార్కెట్ నుంచి రూ.3,900 కోట్ల రుణ సమీకరణ కోసం భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కు ప్రతిపాదనలు పంపింది. ఈ నెల 7న నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని 17 ఏండ్ల కాలపరిమితితో రూ.2 వేల కోట్లు, 30 ఏండ్ల కాలపరిమితితో మరో రూ.1,900 కోట్లు తీసుకుంటామని శుక్రవారం ఇండెంట్ పెట్టింది.
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఆర్బీఐ నుంచే రూ.85,840 కోట్ల అప్పు తీసుకున్నది. ఇది వార్షిక రుణ సమీకరణ లక్ష్యం (రూ.54.009 కోట్లు) కంటే 58.93% అధికం. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్ల రుణాలు సమీకరించనున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టివిక్రమార్క ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక లోటును భర్తీ చేయడంలో కీలక పాత్ర పోషించే మారెట్ రుణాల సేకరణకు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) క్యాలెండర్ను రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసింది. ఈ త్రైమాసికం (క్యూ-1)లో వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం రూ.2,54,509 కోట్ల రుణాల కోసం తమకు ప్రతిపాదనలు పెట్టినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఇందులో తెలంగాణ రూ.18,900 కోట్ల రుణ సమీకరణకు ఇండెంట్ సమర్పించినట్టు తెలిపింది.
