హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారంలో భాగంగా రాబోయే రెండేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 39 కోట్ల మొక్కలు నాటేందుకు రాష్ట్ర అటవీశాఖ ప్రణాళికలు రూపొందించింది. 2023లో 19.30 కోట్ల మొక్కలు, 2024లో 20.03 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించింది. హెచ్ఎండీఏ పరిధిలో అత్యధికంగా 2023లో 6 కోట్ల మొక్కలు, 2024లో 7.50 కోట్లు, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 2023లో కోటి మొక్కలు, 2024లో 50 లక్షల మొక్కలను నాటేందుకు అటవీశాఖ ప్రణాళికలు ఖరారు చేసింది. భద్రాద్రికొత్తగూడెం, ఆదిలాబాద్, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఏడాదికి దాదాపు 40 లక్షలకు పైగా మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళికలను రూపొందించారు. ఇప్పటివరకు ఎనిమిది విడతలుగా నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో దాదాపు 279 కోట్ల మొక్కలను నాటారు. వీటిలో 85% మొక్కలు వృక్షాలుగా ఎదిగాయి.