హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి : ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయకుంటే బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తిగా ఉద్యమిద్దాం. దీనికోసం బహుజనులందరూ ఏకం కావాలి’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంత్యుత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి శ్రీనివాస్‌గౌడ్, మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మె ల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వాయి పాపన్న పోరాట చరిత్రను, ధీరత్వాన్ని నేతలు స్మరించుకున్నా రు. తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్‌గౌడ్ అధ్యక్షతన చిక్కడపల్లిలో కూడా పాపన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా చోట్ల జరిగిన జయంతి సభల్లో వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అన్ని బహుజన కులాలతో సైన్యాన్ని నిర్మించి 33 కోటలను జయించిన వీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. సమైక్య పాలకులు ఆయన చరిత్రను కనుమరుగు చేశారని ఆరోపించారు. లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పొందుపరిచిన పాపన్న చరిత్రను ప్రముఖ విద్యావేత్త దివంగత పేర్వారం జగన్నాథం వెలికితీశారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేశారు.
సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉన్నదని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి స్పష్టంచేశారు. పాపన్న అప్పటి రాచరిక పాలకులకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి, సొంత రాజ్యాన్ని నిర్మించుకొని ప్రజలకు అ ద్భుతమైన పాలన అందించారని గుర్తుచేశారు. బహుజన యోధుడి స్ఫూర్తితో పాలనను అందించి బడుగు వర్గాల అభ్యున్నతికి నాడు కేసీఆర్ బాటలు వేశారని కొనియాడారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఆయన ఆశయాలను నీరు గారుస్తున్నదని ధ్వజమెత్తారు.
సర్వాయి పాపన్న తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. గోల్కొండ సామ్రాజ్యం అంతరించి.. మొగల్ పాలన వేళ్లూనుకుంటున్న తరుణంలో ఒక చిచ్చర పిడుగై ఉద్యమించిన వీరుడు అని కిర్తీంచారు. శివాజీ గెరిల్లా యుద్ధతంత్రంతో బడుగులను కూడగట్టి సైన్యాన్ని నిర్మించి ధైర్య సాహసాలతో గోల్కండ , మొగల్ రాజుల దౌర్జన్యాన్ని, భూస్వాముల రాచరికపు పోకడలను అడ్డుకున్న ధీరుడని కొనియాడారు.
పాపన్నగౌడ్ స్ఫూర్తితో బీసీలందరూ సంఘటితమై కాంగ్రెస్ సర్కార్‌పై ఉద్యమించాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు, ఏటా 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపుల పేరిట నయవంచన చేసి 20 నెలలుగా నాటకమాడుతున్న కాంగ్రెస్ సర్కారుపై పోరాడాలని కోరారు. రాష్ట్రంలోని రేవంత్ సర్కారు బీసీలను మోసం చేసేందుకు రోజుకో నాటకమాడుతున్నదని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకిచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో పాపన్నకు సముచిత గౌరవం దక్కిందని కొనియాడారు. అనేక సంక్షేమ పథకాలతో కల్లుగీత వృత్తిదారులకు న్యాయం జరిగిందని చెప్పారు. కేసీఆర్ రెం డేండ్ల క్రితమే ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహా న్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు. వివిధ కారణాలతో మరణించిన, గాయపడ్డ గీత కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.14 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్‌గౌడ్, ఈడుగ ఆంజనేయగౌడ్, వాసుదేవారెడ్డి, బీసీ కమిషన్ మాజీ మెంబర్ కే కిషోర్‌గౌడ్, బీఆర్ఎస్ నేతలు రాజారాంగౌడ్, మహిళా నేత సుమి త్రా ఆనంద్ పాల్గొన్నారు. కాగా, తెలంగాణ శాసన మండలి కార్యాలయంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిక్కడపల్లిలో మాజీ ఎంపీ వీ హనుమంతరావు, బీసీ మేధావులు ఫోరం పూర్వ చైర్మన్ టీ చిరంజీవులు, సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె విజయ్ కమార్గౌడ్, గీత కార్మిక సంఘం అధ్యక్షుడు ఎంవీ రమణ, గౌడ ఐక్యసాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్‌గౌడ్, మన తెలంగాణ గౌడ సంఘం నాయకుడు గడ్డమీది విజయ్‌కుమార్‌గౌడ్, బాలగోని వెంకటేశ్ గౌడ్, దుర్గయ్య గౌడ్, నాగేశ్ పాల్గొన్నారు.
కేసీఆర్ తన పాలనలో బహుజన వీరుడు పాపన్నగౌడ్‌ను సమున్నతంగా గౌరవించారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడమే కాక, పాపన్నగౌడ్ ఏలిన చారిత్రక కోటలను రక్షించారని, విగ్రహాల ఏర్పాటుకు పూనుకున్నారని, గౌడ వృత్తిపై పన్ను రద్దు చేశారని గుర్తుచేశారు. రెండేండ్ల క్రితమే ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటుకు కేసీఆర్ స్థలం కేటాయించారని ప్రస్తావించారు. ఎన్నో పోరాటా ల ఫలితంగానే నేడు సర్వాయి పాపన్న విగ్రహ పత్రిష్ఠ జరుగుతుందని తెలిపారు. ముదిరాజ్‌లకు ఉచిత చేపపిల్లలిచ్చి, గౌడన్నలకు ప్రమాద బీమా కింద రూ.5 లక్షల పరిహారమిచ్చి, ఆత్మగౌరవ భవనాలు నిర్మించి, బీసీబంధు ఇచ్చి ఆదుకున్న బీఆర్ఎస్ పార్టీయే బీసీలకు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను దెబ్బతీస్తున్నదని ధ్వజమెత్తారు. కల్తీ కల్లు నెపంతో కల్లు దుకాణాలను మూసేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల కేటాయింపులో 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, ఏటా బడ్జెట్లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత టీ హరీశ్‌రావు ఘన నివాళి అర్పించారు. తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి పాపన్నగౌడ్ ప్రతీక అంటూ సోమవారం ఎక్స్ వేదికగా కొనియాడారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతదని పేర్కొన్నారు.