హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర పోలీసుశాఖ తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మూడు ప్రత్యేక ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను నియమించినట్టు తెలుస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 357 ప్రత్యేక ఫ్లయింగ్ స్కాడ్లు విధులు నిర్వర్తిస్తున్నాయి.
ఈ ప్రత్యేక బృందాల్లో తప్పనిసరిగా మెజిస్ట్రేట్ స్థాయి అధికారి ఒకరు, నలుగురు పోలీసు సిబ్బంది, అవసరమైతే కెమెరామెన్/వెబ్‌క్యామ్ సామగ్రి, ప్రత్యేక వాహనం ఉంటాయి. ఎన్నికల అధికారులు, పోలీసులకు వచ్చే సమాచారం, సీ-విజిల్ యాప్ ద్వారా పౌరులు చేసే ఫిర్యాదుల ఆధారంగా వీరి కార్యాచరణ ఉంటుంది. ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల నాయకులు పెట్టే ప్రలోభాలు, ఇచ్చే బహుమతులు, పంచే డబ్బులు, మద్యం వంటి వాటిపై కూడా ఈ ప్రత్యేక ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు దృష్టిసారిస్తాయి. తమ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలు, బూత్‌లు, ఎన్నికల ఏర్పాట్లు, ప్రక్రియను వీరు పరిశీలిస్తారు. అవసరమైతే స్థానిక అధికారులకు సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇస్తారు. ఫ్లయింగ్ స్కాడ్‌ల విధి నిర్వహణ ఎప్పటికప్పుడు కెమెరాలో రికార్డు అవుతుంది.