హైదరాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ): చేనేత, వస్త్ర శాఖకు ప్రభుత్వం రూ.355కోట్లు కేటాయించింది. విద్యార్థుల యూనిఫామ్స్, దవాఖానల్లో ఉపయోగించే బెడ్షీట్లు వంటివి చేనేత సహకార సంఘాల ద్వారా సేకరిస్తామని బడ్జెట్లో ప్రకటించింది. ఇందులో బతుకమ్మ చీరల ప్రస్తావన లేకపోవడం విశేషం. బడ్జెట్లో చేనేత కార్మికులకు ఆర్థిక సహకారం(ఫైనాన్షియల్ అసిస్టెన్స్) కింద రూ.153కోట్లు, కార్మికుల బీమాకు రూ.15కోట్లు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ప్రమోషన్‌కు రూ.187కోట్లు కలిపి మొత్తం రూ.355కోట్లు కేటాయించారు.
అలాగే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ) ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని, త్వరలో ఏర్పాటు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ప్రకటించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఏర్పాటుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు.
కాగా, గత ప్రభుత్వం ఏటా చేనేత కార్మికులను ఆదుకునేందుకు రూ. 500కోట్లు కేటాయించేది. ఇందులో బతుకమ్మ చీరలకే రూ. 300నుంచి రూ.350కోట్లు చెల్లించేవారు. 35వేలమంది చేనేత కార్మికులకు సంవత్సరమంతా చేతినిండా పని దొరికేది. కాగా, ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో బతుకమ్మ చీరల పథకం ప్రస్తావన కూడా తేలేదు.