Bhatti Vikramarka | ఎర్రుపాలెం, ఆగస్టు 21: త్వరలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లకు అర్హులను ఖరారు చేసి, భూమిపూజ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని, అందుకు అందరినీ ఉరికిస్తామని, నిమిషం సమయం కూడా వృథా చేయబోమని చెప్పారు.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. జమలాపురం గ్రామాన్ని రాష్ర్టానికే వన్నె తెచ్చే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు రెండు రోజులపాటు జమలాపురంలో గడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. నాగార్జునసాగర్ ఎడమకాల్వ నుంచి అధికారికంగా తూము ఏర్పాటు చేయించి జమలాపురం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మారుస్తామని తెలిపారు.