భూపాలపల్లి రూరల్, ఆగస్టు 27: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాన్ని ఎన్నుకోవడానికి రూపొందించిన నిబంధనల ప్రకారం మళ్లీ ఎన్నికలను నిర్వహించాల్సిందేనని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) కేంద్ర కమిటీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మిర్యాల రాజిరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సింగరేణిలోని 11 డివిజన్లకు చెందిన యూనియన్ ఉపాధ్యక్షులు, కేంద్ర కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు జరిగిన తర్వాత 45 రోజుల్లోగా గెలిచిన సంఘానికి అధికారిక గుర్తింపు పత్రం జారీ చేయాలని, లేకుంటే గతంలో గెలిచిన సంఘంతోనే సంప్రదింపులు జరపాలని సూచించారు. సింగరేణి వార్షిక లాభాలను తక్షణమే ప్రకటించాలని, లాభాల్లో 35 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేశామని, లాభాల్లో వాటాను పెంచిన విషయాన్ని గుర్తుచేశారు.