నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఏటా కొత్తగా ఆరు లక్షల నుంచి ఆరున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఐదేండ్లల్లో 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో సాగర్ ఎడమకాల్వ ఆయకట్టుతోపాటు ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు, దాని పరిధిలోని లోలెవల్ కెనాల్‌కు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం సాగునీటిని విడుదల చేశారు. పెద్దవూర మండలం పొట్టిచెల్మ హెడ్ రెగ్యులేటరీ వద్ద స్విచ్ ఆన్ చేసి కాల్వలోకి నీటిని వదిలారు. అనంతరం విజయవిహార్లోని అతిథిగృహంలో మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎడమ కాల్వకు 11 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం సొరం గ మార్గాన్ని పూర్తి చేసి ఏఎమ్మార్పీ పరిధిలోని 3.75 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తామని, డిండి ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు.
మంత్రి ఉత్తమ్ తడబాటు
నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటి విడుదలపై మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ తడబాటుకు గురయ్యారు. పదేండ్ల నుంచి ఇంత తొందరగా సాగర్ నీళ్లు ఎన్నడూ వదలి పెట్టలేదని, పూర్తి కెపాసిటీతో నీళ్లు వదలిపెట్టడం జరుగుతుంది చెప్పుకొచ్చారు. 2022లో ఇంతకు ఐదు రోజుల ముందే అప్పటి కేసీఆర్ సర్కార్ సాగునీటిని విడుదల చేసిందనేది సాగర్ ప్రాజెక్టు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మంత్రి అవాస్తవాలను వెల్లడించడంపై అక్కడ ఉన్న మీడియాతోపాటు అధికారులు విస్మయం వ్యక్తంచేశారు.