Mid Day Meals | హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : సర్కారు స్కూళ్లల్లో 32శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తినడం లేదు. ఇంటినుంచి టిఫిన్బాక్స్లు తెచ్చుకుని కడుపునింపుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల వారే కాకుండా.. మారుమూల జిల్లాల్లోని విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని ముట్టడంలేదు. ఏటా వీరి సంఖ్య తగ్గుతుండటంతో కేంద్రం గతంలో 2.25 లక్షల మందికి కోతపెట్టింది. 2022-23తో పోల్చితే 2023-24లో ఏకంగా 3.71లక్షల విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తినడం మానేశారు. ఇందుకు గల కారణాలను అన్వేషించి, సమ్రగ నివేదికను రూపొందించి అందించాలని రాష్ట్ర విద్యాశాఖకు కేంద్రం సూచించింది. అడవుల జిల్లా అయిన ములుగు, అర్బన్ జిల్లా అయిన హైదరాబాద్లో ప్రాథమిక పాఠశాలల్లో 60శాతం విద్యార్థులు మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని తింటుండగా, పెద్దపల్లి, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాల్లో ప్రాథమికోన్నత పాఠశాలల్లోని వారు 60శాతంలోపే స్వీకరిస్తుండటం ఆందోళనకరం. కాగా, రాష్ట్రంలో 27,008 స్కూళ్లుండగా, ఇప్పటి వరకు 3,985 స్కూళ్లకు (15శాతం)మాత్రమే ఎల్పీజీ కనెక్షన్లున్నాయి. మిగతా బడుల్లో కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. అన్ని బడులకు ఎల్పీజీ కనెక్షన్లు అందజేయాలని కేంద్రం సూచించింది.
పులుపు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు తినేందుకు ఇష్టపడటంలేవు. స్కూల్లో ఒకే కూర పెడుతుండటంతో కొంత మంది ఇంటి నుంచి మరో కూరను తెచ్చుకుంటున్నారు. ఆరోగ్యం దృష్ట్యా సైతం మరికొంత మంది తినేందుకు ఇష్టపడటంలేవు. కిచెన్ షెడ్లు లేకపోవడంతో చెట్ల కింద వంట చేయడంతో ఆకులు, పురుగులు పడుతున్నాయి. తక్కువ విద్యార్థులున్న చోట సరుకులు కొనడం ఇబ్బందిగా ఉంటుంది. కావున జిల్లా స్థాయిలోనే సరుకులను టెండర్ల ద్వారా సేకరించాలి.