Runa Mafi | హైదరాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఒకవైపు రుణమాఫీ పూర్తి చేశామని చెప్తున్న ముఖ్యమంత్రి… మరోవైపు రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతులు ఆ పై మొత్తాన్ని చెల్లించిన వెంటనే మాఫీ చేస్తామని ప్రకటించారు. ‘రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేశాం. రూ.2 లక్షలకుపైగా రుణం కలిగిన రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రైతులు రూ.2 లక్షలకు పైబడి ఉన్న మొత్తాన్ని చెల్లించిన మరుక్షణమే మాఫీ చేస్తాం’ అని ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సీఎం తాజా వ్యాఖ్యల ప్రకారం ఇంకా రుణమాఫీ మొత్తం పూర్తికాలేదని స్పష్టమవుతున్నది. రూ.2 లక్షలలోపు రుణాలు కలిగిన రైతుల్లో కూడా చాలామందికి పలు సమస్యలతో మాఫీ కాలేదు. రూ.2 లక్షలకుపైగా రుణం కలిగిన రైతులెవరికీ రుణమాఫీ కాలేదు. అలాంటప్పుడు రుణమాఫీ పూర్తయినట్టు ఎలా అవుతుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
19 లక్షల మంది రైతులు… 13 వేల కోట్లు
ప్రభుత్వ లెక్కల ప్రకారం రుణమాఫీకి అర్హత కలిగిన రైతుల సంఖ్య 42 లక్షలు. వీరికి రుణమాఫీ చేసేందుకు రూ.31 వేల కోట్లు అవసరమని ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది. ఇప్పటివరకు మూడు విడతల్లో 23 లక్షల మందికి రుణమాఫీ చేయగా, ఇందుకోసం రూ.18 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇంకా 19 లక్షల మంది రైతులకు రూ.13 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉన్నది. రూ.2 లక్షలలోపు రుణం ఉన్న సుమారు నాలుగు లక్షల మందికి మాఫీ కాలేదని తెలిసింది. రేషన్‌కార్డు లేకపోవడం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాలో తప్పులు ఉండటం తదితర కారణాలతో వీరికి రుణమాఫీ కాలేదు. రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న రైతులకు ఎప్పుడు మాఫీ అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. రూ.2 లక్షలకుపైగా ఉన్న రుణాన్ని బ్యాంకుల్లో చెల్లించిన వెంటనే మాఫీ చేస్తామని చెప్తున్న ప్రభుత్వం.. ఇందుకు ఎలాంటి గడువూ విధించలేదు. దీనికి తోడు రూ.2 లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని ఇప్పుడే చెల్లించొద్దని, తాము చెప్పినప్పుడే చెల్లించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వీరికి రుణమాఫీ ఎప్పుడు అవుతుంది? అసలు అవుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా ఆగస్టు 15 లోగా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, మాట తప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావు రాజీనామాను కోరడం విడ్డూరంగా ఉన్నదని ప్రతిపక్షం విమర్శిస్తున్నది. ఏ మొహం పెట్టుకొని హరీశ్‌రావును రాజీనామా కోరతారని ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది.