వరంగల్, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ కొనసాగుతున్నది. అధికార పార్టీ నేతల అండదండలతో, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎండీసీ) సహకారంతో కాంట్రాక్టర్లు మరింత రెచ్చిపోతున్నారు. అక్రమ వసూళ్లకు తెరలేపి సహజ సంపదను దోచుకొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక ఇసుక దోపిడీ స్పీడ్ అందుకొన్నది. గత కేసీఆర్ సర్కారు మాత్రం ఇసుక ధరలు అందరికీ అందుబాటులో తేవాలనే లక్ష్యంగా పెట్టుకొని, ఇసుక క్వారీలు నిర్వహించాలని నిర్ణయించి, ఆ మేరకు పాలసీని రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంతోపాటు వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఈ పాలసీ తీసుకొచ్చింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ పరిధిలోని ఇసుక క్వారీలు అక్రమాలకు నిలయంగా మారాయి.
అధిక ధరలకు ఇసుకను విక్రయించి వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. టీఎస్ఎండీసీ పేరిట లారీల యజమానులు చెల్లించిన మొత్తం కంటే ఐదారు టన్నులు అధికంగా లారీల్లో ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. గోదావరి నదిలోని ఇసుక క్వారీల్లో అక్రమంగా ఇసుకను దోపిడీ చేస్తున్నారు. ఒక్కో లారీ నుంచి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. తొమ్మిది క్వారీల నుంచి ప్రతిరోజూ 700 లారీల్లో వరంగల్, హైదరాబాద్ మహానగరాలకు 17,100 టన్నుల ఇసుక రవాణా జరుగుతున్నది. రోజుకు ఒక్కో లారీకి రూ.5 వేల చొప్పున దాదాపు రూ.30 లక్షల చొప్పున దోపిడీ జరుగుతున్నది. అధికార పార్టీ నేతల అండదండలతో కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి ఈ దందా సాగిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఈ దందా జోరందుకున్నది. క్వారీల వద్ద దోపిడీ, అక్రమాలపై టీఎస్ఎండీసీ అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని లారీ యజమానులు వాపోతున్నారు.
గోదావరి సాక్షిగా…
గోదావరి నదిలో తవ్విన ఇసుకను అక్కడి నుంచి రవాణాకు అనుగుణంగా ఉండే ప్రాంతానికి తరలించి అక్కడ స్టాక్ యార్డును ఏర్పాటు చేస్తారు. ఇలా ఇసుకను తవ్వి స్టాకు యార్డు వరకు రవాణా చేసేందుకు టీఎస్ఎండీసీ కాంట్రాక్టర్లను నియమిస్తుంది. టీఎస్ఎండీసీ క్యూబిక్ మీటరు చొప్పున కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తుంది. నదిలో ఇసుక తవ్వకం, రవాణా మాత్రమే కాంట్రాకర్ల పనులుగా ఉంటాయి. అధికార పార్టీ ముఖ్యనేతలు, వారి అనుచరులే కాంట్రాకర్లుగా ఉండటంతో ఇక్కడి వ్యవహారాలన్నీ వారి పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారి గోదావరి ఇసుకతో కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. టీఎస్ఎండీసీ పేరుతో ఆన్లైన్ సాండ్ ఆర్డర్ రిసిప్ట్‌ను చూపించిన వారికి అందులో పేర్కొన్న ప్రకారం క్వారీల వద్ద లారీల్లో ఇసుకను ఉచితంగా లోడింగ్ చేయాలి. ఈ లోడింగ్ కోసం క్వారీల్లో అదనంగా రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. క్వారీల వద్ద కాంటా వేసినందుకు ఒక్కో లారీ నుంచి రూ.200 వసూలు చేస్తున్నారు. ఇసుక గాలికి చెదరకుండా లోడ్పైన టార్పాలిన్, ప్లాస్టిక్ కవర్ కట్టేందుకు క్వారీల వద్ద ఒక్కో లారీకి వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. మొత్తంగా ఇసుక డంపింగ్ యార్డుకు వెళ్లిన లారీ లోడింగ్‌తో బయటికి వచ్చే ఒక్కో లారీకి రూ.5 వేలు బలవంతంగా వసూలు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, మహాదేవపూర్ పరిధిలో గోదావరి నదిలో ఉన్న ఇసుక రీచ్‌లు కాంట్రాక్టర్లకు, టీఎస్ఎండీసీ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. కాళేశ్వరం పరిధిలో మద్దులపల్లి (పలుగుల 7), అన్నారం కామన్ క్వారీ, అన్నారం బరాజ్ అప్‌స్ట్రీమ్ క్వారీ, పుస్కుపల్లి(కొల్లూరు 2, పలుగుల 5, పలుగుల 8, పలుగుల 11, పుస్కుపల్లి (పలుగుల 6).. మహదేవపూర్ పరిధిలోని పెద్దంపేట క్వారీల నుంచి ప్రతి రోజూ 700 లారీల్లో వరంగల్, హైదరాబాద్ నగరాలకు 17,100 టన్నుల ఇసుక రవాణా జరుగుతున్నది.
అంతా అక్రమాలే…
టీఎస్ఎండీసీ క్వారీలు, యార్డుల వద్ద లారీలలో లోడింగ్ చేసే ధరను రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు రూ.375గా నిర్ణయించింది. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, సర్వీసు చార్జీ, రోడ్డు డ్యామేజీ చార్జీలు కలిపి టన్నుల ప్రకారం డీడీ మొత్తం ఉంటుంది. లారీల పరిమాణం ప్రకారం 16.38 టన్నులు, 21.06 టన్నులు, 26.52 టన్నుల లోడింగ్‌కు అవకాశం ఉంటుంది. టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో సాండ్ సేల్స్ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఇసుక అవసరమైన వారు(లారీ ఓనర్లు) ఆన్లైన్లో డబ్బులను చెల్లిస్తారు. అయినా, లారీలు క్వారీలకు వస్తున్నప్పుడే అకడ సిబ్బంది లారీ డ్రైవర్ల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నారు. రూ.2 వేలు ఇచ్చిన వారికి ఒక బకెట్, రూ.4 వేలు ఇచ్చిన వారికి రెండు బకెట్ల చొప్పున లారీల్లో అదనంగా ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఒక బకెట్‌కు సుమారుగా ఐదారు టన్నులు అదనంగా ఎకువ ఇసుక లోడ్ అవుతున్నది.
అక్రమంగా ఇసుక డంప్‌లు!
కొత్తపల్లి మండలం నందిగామకు చెందిన ఓ పోలీస్ అధికారి ఇంటి నిర్మాణం కోసం శివారులోని వాగు నుంచి రెండ్రోజులుగా ఇసుక తరలిస్తున్నాడు. రాత్రి వేళ గుట్టుగా రవాణా చేస్తూ తన పొలంలో సుమారు 70 ట్రాక్టర్ల ఇసుక డంప్ చేయించాడు. విష యం అధికారులకు తెలిసినా అతనికే అండ గా నిలిచినట్టు తెలుస్తున్నది. ఉద్యోగులు సైతం చేసేది లేక ఆన్లైన్ పేరుతో అందిస్తున్నామని చెప్పి అప్పటికప్పుడు 20 ట్రాక్టర్ల ఇసుకను బుక్ చేసుకున్న వారికి శుక్రవారం సరఫరా చేశారు. మిగితా ఇసుక ఆనలైన్లో బుక్ చేసుకున్న వారికే చేరుతుందా? లేక రహస్యంగా సదరు అధికారికి అప్పగిస్తా రా? అన్న అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నది. తహసీల్దార్ అనిల్‌కుమార్‌ను వివరణ కోరగా స్థానికుల సమాచారంతో నందిగామ శివారులోని 60 ట్రాక్టర్ల ఇసుక డంప్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.