పర్వతగిరి, మార్చి 4: విద్యుత్తు తీగలు తెగిపడి ముగ్గురు మృత్యువాతపడగా.. తీవ్రంగా గాయపడిన ఓ బాలుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యాతండాలో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. మోత్యాతండా ప్రజలు సంతోషంగా దుర్గమ్మ పండుగ జరుపుకుంటున్నారు. సోమవారం బోనాలు కూడా సమర్పించారు.
మంగళవారం పండుగ కోసం బంధువులను పిలుచుకున్నారు. ఈ సందర్భంగా తండావాసులు తమ ఇండ్ల ముందు టెంట్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటల సమయంలో తండాకు చెందిన భూక్యా రవి(30) టెంట్ వేస్తుండగా స్ట్రీట్ లైట్ విద్యుత్తు తీగ తెగి అతడి ఇంటి ముందు పడింది. ఆ సమయంలో రవితోపాటు అక్కడే ఉన్న రవిబావ రాయపర్తి మండలం గట్టికల్‌కు చెందిన గుగులోత్ దేవేందర్(32), టెంట్ వేసేందుకు వచ్చిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం జమస్తాన్పురానికి చెందిన సునీల్(20)లకు విద్యుత్తు షాక్ తగిలింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దేవేందర్, సునీల్ అక్కడికక్కడే మృతిచెందగా.. దవాఖానకు తీసుకెళ్తుండగా రవి మార్గమధ్యంలో మృతిచెందాడు. కాగా.. రవి కుమారుడు జస్వంత్(4) తీవ్ర గాయాలతో ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంతో తండాలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఓవర్ లోడ్‌తో తీగలు తెగిపడ్డాయని, గతంలో ఓవర్‌లోడ్ విషయమై అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.