సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని (Suryapet) ఆత్మకూరు (ఎస్) మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని నశింపేట వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు కూడా మృతిచెందాడని పోలీసులు తెలిపారు. దీంతో మృతు సంఖ్య నాలుగుకు చేరింది.
మృతులు లక్ష్మీనాయక్ తండాకు చెందిన దరావత్ ఆనంద్, బొట్యతండాకు చెందిన బుక్యా నవీన్, తెట్టెకుంట తండాకు చెందిన బానోతు అరవింద్, ఏపూరు తండాకు చెందిన వినేశ్గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.