కరీంనగర్ సీపీ కార్యాలయం పరిధిలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. ముందు వెనుకా చూడకుండా కేసులు నమోదు చేస్తున్నారు. భూవివాదాల ఫిర్యాదులపై కనీసం విచారించకుండానే బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల కక్షపూరిత వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసిన ఘటనలో పోలీసుల అత్యుత్సాహం బట్టబయలైంది. కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ తగలడంతో వారి వైఖరిపై అనుమానాలు కలుగుతున్నాయి.
Karimnagar | కరీంనగర్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గత కొద్దిరోజులుగా కరీంనగర్ సీపీ కార్యాలయం పరిధిలో బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లపై పోలీసులు వివిధ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. బుధవారం మరో ముగ్గురు బీఆర్ఎస్ నేతలైన (బీఆర్ఎస్ కార్పొరేటర్ల భర్తలు) ఎడ్ల ఆశోక్, కాశెట్టి శ్రీనివాస్, తుల బాలయ్యను అరెస్ట్ చేశారు. ఈ విషయంలో పోలీసులు అత్యుత్సాహం చూపినట్టుగా విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ కేసు విషయంలో కోర్టులో పోలీసులకు ఇదేరోజు ఎదురుదెబ్బ తగిలింది. నిందితులపై పోలీసులు పెట్టిన సెక్షన్లు సమంజసంగా లేవని, 41 సెక్షన్ కింద నోటీస్ ఇచ్చి విడుదల చేయాలని ఆదేశించింది. దాంతో కంగుతిన్న పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు వారిని విడుదల చేశారు.
భూవివాదాలు, ఆక్రమణలు, బెదిరింపులు తదితర ఫిర్యాదులకు సంబంధించి పరిశీలించడానికి కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి కమిషనరేట్ పరిధిలో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (ఈవోడబ్ల్యూ)ను ఏర్పాటుచేశారు. ఫిర్యాదులు తీసుకోవడం, వాటిని పరిశీలించి చట్టానికి లోబడి బాధితులకు న్యాయం చేయడం వంటివి స్వాగతించదగినదే. కానీ కొద్దిరోజులుగా కరీంనగర్లో నమోదవుతున్న కేసులన్నీ.. బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా జరుగుతున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి.
ఏది నిజం? ఏది అబద్ధం?
కరీంనగర్‌కు చెందిన మామిడి రవీందర్‌రెడ్డి పేరిట ఇచ్చిన తాజా ఫిర్యాదుపై ఆ ముగ్గురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తన సతీమణి మామిడి పుష్పలత పేరుపై తీగలగుట్టపల్లి గ్రామ పంచాయతీ శివారులో 2004లో సర్వేనంబర్ 240/ఎలో 555.97 చదరపు గజాలు, 2005లో 189 గజాల మొత్తం విస్తీర్ణం 744.97 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్టు రవీందర్‌రెడ్డి తెలిపారు.
2017లో ఆ స్థలానికి తీగలగుట్టపల్లి గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకొని ప్రహరీ, షెడ్డు నిర్మించుకున్నట్టు తెలిపారు. ఇదే సర్వేనంబర్‌లో 1.20 ఎకరాల భూమిని మూల అరుణాదేవి కొనుగోలు చేయగా, వాటిని 26 ప్లాట్లు చేసి విక్రయించారని, వాటిని కొనుగోలు చేసిన వారు స్థానికంగా లేకపోవడంతో మాజీ జడ్పీటీసీ కాశెట్టి శ్రీనివాస్ తమ వద్దకు వచ్చి కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలంటే.. డబ్బు ఇవ్వాలని బెదిరించినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాము స్పందించకపోవడంతో చుట్టుపక్కల కాలనీవాసులను ప్రోత్సహించి ప్లాట్ల రోడ్డుపైనే శవాలను ఖననం చేయించారని, ఇది శశ్మానవాటిక కాదని తాము చెప్పడంతోపాటు ఇదే విషయాన్ని కాశెట్టి శ్రీనివాస్ వద్దకు వెళ్లి అడిగామని, తాను డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వలేదు కాబట్టి ప్లాట్లు మీకు కాకుండా చేస్తానని చెదిరించినట్టుగా ఆ ఫిర్యాదులో తెలిపారు.
అలాగే 2019 జనవరి 2న కిసాన్‌నగర్ మాజీ కార్పొరేటర్ ఎడ్ల అశోక్‌తోపాటు మాజీ వార్డు మెంబర్ అల్లబిల్లి నగేశ్ తదితరులు కొందరు కలిసి వచ్చి తాను నిర్మించుకున్న ప్రహరీతోపాటు షెడ్డును జేసీబీతో కూల్చి వేశారని, ఇదేమిటని అడిగితే.. ఇది ప్రభుత్వ భూమి.. ఇక్కడి నుంచి వెళ్లకపోతే గడ్డపారతో పొడిచి చంపుతామని బెదిరించారని, ఆ సమయంలో ఎడ్ల అశోక్‌కు భయపడి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.
2019 మార్చి 19న తీగలగుట్టపల్లి పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన తర్వాత తిరిగి కాశెట్టి శ్రీనివాస్, తుల బాలయ్య, ఎడ్ల ఆశోక్ తమ ప్లాట్ల యాజమానులను పిలిపించి.. 240/ఎ సర్వేనంబర్‌లోని భూమి కార్పొరేషన్లో కలిసిందని, ప్లాట్‌కు రూ.3 లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇవ్వని పక్షంలో ఆ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి అక్కడ శ్మశానవాటిక ఏర్పాటు చేస్తామని బెదిరించారని, తనతోపాటు ప్లాట్ కొన్న గాలిపెల్లి రాజమౌళి, ఏలేటి రఘుపతిరెడ్డి ఒక్కొక్కరం లక్ష చొప్పున మొత్తం రూ. 3 లక్షలను ఎడ్ల అశోక్‌కు ఇచ్చినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
తర్వాత ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంతో అక్కడ ప్రభుత్వ భూమి లేదని తెలుసుకున్నామని చెప్పారు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ మిగిలిన డబ్బు ఇవ్వాలంటూ తమను బెదిరించారని, ఇవ్వకపోతే మళ్లీ బెదిరించారని, దీంతో తాను కోర్టును ఆశ్రయించి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించామని తెలిపారు. ప్లాట్‌కు రూ.3 లక్షలు వసూలు చేయాలన్న దురుద్దేశంతో తమను ఇబ్బంది పెట్టడంతోపాటు ప్రహరీ, షెడ్డును కూల్చి బెదరింపులకు పాల్పడుతున్న కాశెట్టి శ్రీనివాస్, ఎడ్ల అశోక్, తుల బాలయ్య, అల్లిబిల్లి నగేశ్, శివరాత్రి సమ్మయ్యతోపాటు తదితరులపై చర్యలు తీసుకోవాలని తాజా ఫిర్యాదులో కోరారు.
కోర్టులో కొనసాగుతున్న సివిల్ దావా
ప్రస్తుతం ఫిర్యాదు చేసిన మామిడి రవీందర్‌రెడ్డి (సతీమణి మామిడి పుష్పలత)తోపాటు తాజా ఫిర్యాదులో ఒక్కొక్కరు లక్ష ఇచ్చినట్టుగా చెప్తున్న గాలిపెల్లి రాజమౌళి, ఏలేటి రఘుపతిరెడ్డితో కలసి మొత్తం తొమ్మిది మంది 2019 డిసెంబర్ 12న కరీంనగర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సివిల్ దావా (ఓఎస్నంబర్474/2019) వేశారు. ఆ దావాలో ఎడ్ల అశోక్‌తోపాటు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జిల్లా కలెక్టర్, తహసీల్దార్, పంచాయతీ సెక్రటరీని ప్రతివాదులుగా చేర్చారు.
కానీ, ఈ దావాలో ఎక్కడా కూడా కాశెట్టి శ్రీనివాస్, తుల బాలయ్య పేరు ప్రస్తావనే లేదు. 2019 మార్చి 19న తీగలగుట్టపల్లి కరీంనగర్ కార్పొరేషన్లో కలిసిందని, ప్లాట్‌కు మూడు లక్షలు ఇవ్వాలని కాశెట్టి శ్రీనివాస్, ఎడ్ల అశోక్, తుల బాలయ్య అడిగారని ఫిర్యాదు చేసిన వ్యక్తులు.. 2019 డిసెంబర్లో కోర్డులో వేసిన దావాలో మాత్రం ఆ వివరాలను ఎందుకు చేర్చలేదన్నది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న. అలాగే ఎడ్ల ఆశోక్ కన్నా ముందుగానే.. కాశెట్టి శ్రీనివాస్ డబ్బు కోసం బెదిరించారని తాజా ఫిర్యాదులో పేర్కొన్నారు.
కానీ కోర్టు దావాలో మాత్రం కాశెట్టి పేరుగానీ, తుల బాలయ్య పేరును గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. కనీసం వారు బెదిరించినట్టుగా చెప్పలేదు. అలాగే కోర్టు దావాలో ఎడ్ల అశోక్‌తోపాటు మున్సిపల్ అధికారులు వచ్చి తన షెడ్డు, ప్రహరీని కూల్చి వేశారని చెప్పిన వ్యక్తులు.. ఇప్పుడు ఎడ్ల అశోక్ ఇంకా కొంత మందిని తీసుకొచ్చి కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తాజా ఫిర్యాదులో ఈ వివాదంపై కోర్టులో దావా నడుస్తున్నట్టుగా ఎక్క డా పోలీసులకు వివరాలు ఇచ్చినట్టుగా దాఖలాలు లేవు.
అనుమానాలు.. ఎన్నెన్నో సందేహాలు
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే? కోర్టులో ఫైల్ చేసిన కేసు నిజమా? లేక తాజా ఫిర్యాదు నిజమా? ఏది నిజం? ఏది అబద్ధం? అన్నదానిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ప్రస్తుతం కోర్టులో ఉన్న కేసు తదుపరి విచారణ వచ్చే నెల మార్చి16న ఉన్నది. ఈ విషయాన్ని పోలీసులు ఏమాత్రం పరిగణనలోకి తీసకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. 2019 మార్చి 7న సర్వే చేయించారు. దీంతో అక్కడ ప్రభుత్వ భూమి లేదని తెలిసింది. ఈ విషయాన్ని ఫిర్యాదులోనే ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.
పోలీసులకు కోర్టులో ఎదురుదెబ్బ
మామిడి రవీందర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపిన పోలీసులకు బుధవారం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో 386, 452, 427, 506, 120-డీఆర్/డబ్ల్యు 34 ఐపీసీ కింద నిందితులుగా కాశెట్టి శ్రీనివాస్, ఎడ్ల అశోక్, తుల బాలయ్యతోపాటు పలువురిపై కేసు నమోదు చేసి బుధవారం కరీంనగర్ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ జడ్జి షరినా ముందు హాజరుపర్చారు. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన మెజిస్ట్రేట్ ఈ కేసులో ఇప్పటికే కోర్టులో సివిల్ దావాతోపాటు ప్రైవేట్ ఫిర్యాదు దాఖలై ఉన్నదని, ఈ కేసులో నిందితులకు 386 సెక్షన్ వర్తించదని కోర్టు చెప్పింది. కోర్టు ఆదేశాల తో నిందుతులకు నోటీసులు ఇచ్చి విడుదల చేశారు.
కాంగ్రెసోళ్లు, పోలీసులు కుమ్మక్కైండ్రు
ఆత్మకూరు బాధిత బీఆర్ఎస్ నాయకులు
కాంగ్రెసోళ్లు, పోలీసులు కుమ్మక్కై తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో పోలీస్ బాధిత బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. తమను నాలుగు పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పి విచక్షణారహితంగా చితకబాధారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నిజనిర్ధారణ కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సమ్మక్క-సారలమ్మ దేవతల సాక్షిగా తాము తప్పులు చేయలేదని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి వస్తున్నారని వెళ్లామని,. జై తెలంగాణ, జై చల్లా అనే నినాదాలు చేశామని తెలిపారు. కావాలంటే జాతర సీసీ కెమెరాలను పరిశీలించాలని కోరారు. సమావేశంలో బాధిత బీఆర్ఎస్ నాయకులైన వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, రేవూరి సుధాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నేరెళ్ల కమలాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, సీనియర్ నాయకులు ఆవుల శ్రీనివాస్, వంచ సాంబశివరెడ్డి, కాంతాల రవీందర్‌రెడ్డి, వేల్పుల గణేశ్, రేగుల కిషోర్ పాల్గొన్నారు.