హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): బీసీల రిజర్వేషన్ల పెంపుకోసం అసెంబ్లీలో మూడు వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీల రిజర్వేషన్ల అమలు కోసం ఆ బిల్లులను ప్రవేశపెట్టాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం అలా చేయకపోతే న్యాయపరమైన చికులు ఎదురవుతాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పెం పు అంశం గంభీరమైనదని, ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలని స్పష్టంచేశారు. గురువారం ఆమె నివాసంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ అంశం కేంద్ర, రాష్ర్టాల ఉమ్మడి జాబితాలో ఉంటుందని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం మాత్రమే రాష్ర్టాల జాబితాలో ఉంటుందని పేర్కొన్నారు. ఉమ్మడి జాబితా, స్థానిక సంస్థల అంశాలను వేర్వేరుగా చేయాలని సూచించారు. రాష్ట్ర జాబితాలో ఉన్న కారణంగా పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి గతంలో కేసీఆర్ చట్టం తెచ్చి సాధ్యం చేశారని గుర్తుచేశారు.
రాజకీయ క్రీడలో బీసీ బిడ్డలు బలి
బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ క్రీడలో బీసీ బిడ్డలు బలవుతున్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ‘కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో ప్రజాస్వామ్యం ఓడి, పార్టీలు గెలిచాయి. ఆ రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఓడించాయి’ అని ఆమె విమర్శించారు. ‘ఆ రెండు పార్టీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయని తెలిపారు. దీంతో పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి గెలవలేకపోయారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకయ్యాని ఆరోపించారు.