హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) టీఎస్ఐపాస్, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో రాష్ర్టానికి 3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో తమ ప్రభుత్వం ఘన విజయం సాధించిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, పారదర్శక పాలనతోపాటు సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కార్యరూపం దాల్చిన టీఎస్ ఐపాస్‌తో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన, రానున్న పెట్టుబడులపై మంత్రి కేటీఆర్ సోమవారం సమీక్షించారు. 2014 నుంచి గత నవంబర్ వరకు దాదాపు రూ. 3.30 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ఇవి కేవలం టీఎస్ఐపాస్, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో వచ్చినవని, మైనింగ్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఆతిథ్య రంగాల్లో మరిన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. త్వరలోనే ఆ వివరాలు కూడా అందిస్తామని చెప్పారు.
ఈ పెట్టుబడులతో 22.50 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించిందని చెప్పారు. దాదాపు 14 రంగాలను ప్రాధాన్య రంగాలుగా గుర్తించి పక్కా ప్రణాళికను రూపొందించి, భారీ పెట్టుబడులు సాధించామని అన్నారు. ఒకో రంగానికి ప్రత్యేకంగా అధికారిని నియమించడంతో పాటు ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్న కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు నిర్వహించామని చెప్పారు. అన్ని రంగాలలో వచ్చిన పెట్టుబడులపై ఒక నివేదిక రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు రావడానికి కృషి చేసిన పరిశ్రమలు, ఐటీ శాఖలోని ప్రతి అధికారికి, వారి టీమ్ స్పిరిట్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి, వివిధ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.