‘24గంటల కరెంటు వద్దు, 3 గంటలో 5 గంటలు ఇస్తే సరిపోద్దని నేను అన్నట్టు కేసీఆర్ చెప్తున్నారు. ఎక్కడ అన్నానో చూపించాలి. 24 గంటల కరెంటు వద్దు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడే గంటలు కరెంటు ఇస్తామని ఎక్కడ అన్నామో చూపించాలి.’
– మంగళవారం అలంపూర్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
‘తెలంగాణలో 95% మంది రైతులు మూడు ఎకరాలలోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులే. ఒక ఎకరా భూమికి నీళ్లు పారించాలంటే ఒక గంట కరెంటు సరిపోతుంది. ఫుల్లుగా మూడు ఎకరాలకు నీళ్లు పారించాలంటే మూడు గంటల కరెంటు సరిపోతుంది.’
-ఈ ఏడాది జూలై 10న అమెరికా తానా సభలో రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాటమార్చారు. రాష్ట్రంలోని రైతులకు 3 గంటల విద్యుత్తు కావాలా? నిరంతర విద్యుత్తు కావాలా? అని ఎన్నికల సభల్లో సీఎం కేసీఆర్ రైతులను ప్రశ్నిస్తుండటం, రైతులు తమకు 24 గంటల కరెంటు కావాలని ముక్తకంఠంతో కోరుతుండటంతో రేవంత్‌రెడ్డి మాట మార్చారు.
నిజానికి కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా 24 గంటల కరెంటు ఇస్తున్న దాఖలాలు లేవు. కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మన రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పేర్కొనడం కాంగ్రెస్‌కు మైనస్‌గా మారింది. దీంతో డ్యామేజీ కంట్రోల్లో భాగంగానే రేవంత్‌రెడ్డి తాజా వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. కరెంటు విషయంలో కాంగ్రెస్‌ను నమ్మేదిలేదని రైతులు చెప్తున్నారు.