PM Kisan | హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం దొంగదెబ్బ తీసింది. అడ్డమైన కొర్రీలతో అన్నదాతను మోసం చేస్తున్నది. ఒకవైపు రైతుబంధులో అర్హుల సంఖ్య ను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను అ క్కున చేర్చుకొంటుంటే, మోదీ సర్కారు మాత్రం పీఎం కిసాన్‌లో ఉన్న రైతులను తొలగిస్తూ వారి పొట్ట కొడుతున్నది. పీఎం కిసాన్ నుంచి తెలంగాణ రైతులను భారీ సంఖ్యలో తొలగించింది. గత కొన్ని విడతలుగా ఇదే తంతు కొనసాగుతున్నది. విడత విడతకు అర్హులైన రైతుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నది. దీంతో పీఎం కిసాన్ సాయం ఎవరికి అందుతున్నదో ఎవరికి అందడంలేదో తెలియడం లేదు.
పీఎం కిసాన్‌లో కేంద్రం భారీ సంఖ్యలో రైతులను జాబితా నుంచి తొలగించింది. పీఎం కిసాన్ కింద తొలివిడతలో రాష్ట్రంలోని 26.61 లక్షల మంది రైతులకు సాయం చేసింది. రెండో విడతలో 34.37 లక్షల మందికి, మూడో విడతలో 35.55 లక్షల మందికి, నాలుగో విడతలో 35.68 మందికి అందించింది. అత్యధికంగా ఆరో విడతలో 37.36 లక్షల మందికి కేంద్రం పీఎం కిసాన్ అందించింది. అయితే ఇటీవల 13వ విడతలో 29.81 లక్షల మంది రైతులకు మాత్రమే పీఎం కిసాన్ అందించడం గమనార్హం. అంటే ఆరో విడతతో పోల్చితే ప్రస్తుతం 7.55 లక్షల మంది రైతులను జాబితా నుంచి తొలగించింది. ఏడో విడత నుంచి లబ్ధిదారుల సంఖ్యను కేంద్రం క్రమంగా తగ్గిస్తూ వస్తున్నది. ఏడో విడతలో 37.19 లక్షలు, 8వ విడతలో 36.75 లక్షలు, 9వ విడతలో 36.48 లక్షలు, పదో విడతలో 36.35 లక్షలు, 11వ విడతలో 35.81 లక్షలు, 12వ విడతలో 33.01 లక్షల మందికి ఇవ్వగా 13వ విడతలో 29.81 లక్షల మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందించింది. గత విడతతో పోల్చినా 3.2 లక్షల మంది రైతులకు కేంద్రం మొండిచెయ్యి చూపించింది.
ఓవైపు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ జాబితాలోని రైతులను తొలగిస్తుంటే.. తెలంగాణ ప్రభు త్వం మాత్రం రైతుబంధు పథకంలో భారీ సంఖ్య లో కొత్త రైతులకు అవకాశం ఇచ్చి అండగా నిలుస్తున్నది. రైతుబంధు అమలు నుంచి ఇప్పటివరకు కొత్తగా 18.74 లక్షల మంది రైతులను పథకంలో చేర్చింది. 2018లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు తొలి విడతలో 50.25 లక్షల మంది రైతులకు రైతుబంధు అందించగా, ప్రస్తుతం 11వ విడతలో ఏకంగా 68.99 లక్షల మందికి రైతుబంధు ను అందించింది. ఈ విధంగా ఏటా అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పెట్టుబడి సా యం అందిస్తున్నది. పీఎం కిసాన్, రైతుబంధు పథకాల కింద రైతులకు అందించిన పెట్టుబడి సాయం మొత్తంలోనూ భారీ తేడా ఉన్నది. పీఎం కిసాన్ కింద కేంద్రం ఎకరానికి సీజన్‌కు కేవలం రూ.2 వేలు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీజన్‌కు ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుకు ఉన్న మొత్తం భూమికి అందిస్తున్నది. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇప్పటివరకు తెలంగాణ రైతులకు అందించిన సాయం కేవలం రూ.9,028 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద అందించిన సాయం ఏకంగా రూ.73 వేల కోట్లు కావడం గమనార్హం. పీఎం కిసాన్తో పోల్చితే రైతుబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 39.18 లక్షల మంది రైతులకు అదనంగా పంట పెట్టుబడి సాయం అందిస్తున్నది.
పీఎం కిసాన్ పథకంపై కేంద్రం వైఖరి విచిత్రంగా ఉన్నది. రైతులపై కేంద్రం ఎంత వివక్ష చూపిస్తున్నదో స్పష్టమవుతున్నది. పీఎం కిసాన్‌లో కొత్త రైతుల చేరికకు మోదీ సర్కారు అవకాశం ఇవ్వటంలేదు. పైగా జాబితాలో ఉన్న రైతులను తొలగిస్తుస్తున్నది. దీంతో రైతులు మోదీ సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదేం విధానమని మండిపడుతున్నారు. 2019 ఫిబ్రవరి 19న ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో అర్హుల జాబితా రూపకల్పనకు సవాలక్ష ఆంక్షలు, నిబంధనలు పెట్టారు. మరీ ముఖ్యంగా 2019 ఫిబ్రవరిలోపు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులని నిర్ణయించారు. ఆ కటాఫ్ తేదీ తర్వాత సొంత భూములు సంపాదించి వ్యవసాయం చేసుకొంటున్న రైతులకు అవకాశం ఇవ్వలేదు. 2024 వరకు పీఎం కిసాన్‌లో కొత్త రైతులకు అవకాశం కల్పించరాదని బీజేపీ సర్కారు నిర్ణయించింది. దీంతో భారీ సంఖ్యలో అర్హులైన రైతులకు అన్యాయం జరుగుతున్నది.