Substations | హైదరాబాద్, మే 1(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు పాలన పడకేసింది. అసలు ఆ సంస్థల్లో ఏం జరుగుతున్నదో ఎవరికీ అంతుబట్టడంలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న చర్యలను గుడ్డిగా వ్యతిరేకించడం, ప్రతీ పనిలోనూ అమ్యామ్యాల కోసం ఎగబడటమే కనిపిస్తున్నది. దీనికి మరో ఉదాహరణ ఎన్పీడీసీఎల్. దీని పరిధిలో నిరుడు జూలై-ఆగస్టు నెలల్లో సబ్స్టేషన్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా సబ్స్టేషన్లు నిర్మించాలంటే జిల్లాల వారీగా, డివిజన్ల వారీగా టెండర్లు పిలిచేవారు. సంబంధిత జిల్లా, డివిజన్‌ను యూనిట్‌గా తీసుకోవడంతో సబ్స్టేషన్ల సంఖ్య తక్కువ ఉండేది.
స్థానిక కాంట్రాక్టర్లు వీటిలో పాల్గొని సబ్స్టేషన్ల నిర్మాణం, నిర్వహణ పనులు చేపట్టేవారు. కానీ, కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తిగా కేంద్రీకృతం చేసింది. ఒకేసారి 280 సబ్స్టేషన్లకు జోన్లవారీగా టెండర్లు పిలిచింది. నిబంధనల్లో కూడా మార్పులు చేసింది. 280 సబ్స్టేషన్ల నిర్మాణ పనులంటే బడా కంపెనీలు, బడా కాంట్రాక్టర్లు తప్ప, ఇతరులు వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో గత జూలై నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు టెండర్లు పిలిచినా స్పందన మాత్రం లేదు. దీంతో తాజాగా ఆరోసారి టెండర్లు పిలిచారు. టెండర్లు ఎందుకు ఖరారు కావడం లేదన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంట్లో ప్రధానమైనది డబ్బుల వ్యవహరమేనని చెప్తున్నారు. ఓ కీలక నేత, ఒకరిద్దరు అధికారులు కొత్త పద్ధతికి తెరతీశారని, ఆరుసార్లు టెండర్లు పిలిచినా రాలేదని చెప్పి తమకు అనుకూలమైన వారికి పనులు అప్పగించుకునేందుకు స్కెచ్ వేశారని చెప్తున్నారు.
ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు చెందిన కొన్ని పనులు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఒక కాంట్రాక్టర్‌కు మెటీరియల్ సరఫరాకు సంబంధించిన కాంట్రాక్టు దక్కింది. సుమారు 300 కోట్ల రూపాయల టెండర్ అది. వైర్లు, ట్రాన్స్ఫార్మర్ బుషింగ్ రాడ్లు, ఏబీ స్విచ్‌లు, బ్రేకర్లు.. ఇలా సబ్స్టేషన్లకు, ట్రాన్స్ఫార్మర్లకు అవసరమైన సామగ్రిని అధికారులు ప్రతీ ఏడాది కొనుగోలు చేస్తుంటారు. నిరుడు కూడా కొన్నారు. వేసవి కాలం సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లలో సమస్యలు వస్తుంటాయి. మరమ్మత్తులకు అవసరమైన మెటీరియల్ ఉంటే త్వరగా మరమ్మతులు పూర్తిచేసి పంపవచ్చన్నది మెటీరియల్ కొనుగోళ్ల వెనుక ఉన్న లక్ష్యం. అయితే, గతకొన్ని నెలలుగా జిల్లాల్లో ఉండే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) వర్క్‌షాపులలో, స్టోర్లలో ఎలాంటి మెటీరియల్ అందుబాటులో లేదు. దీనిపై స్థానిక అధికారులు ఉన్నతాధికారులను అడిగితే వస్తుంది, కొనుగోలు చేశామని చెప్తున్నారు. కానీ, మెటీరియల్ స్టోర్లలోకి రావడం లేదు. ఎందుకు రావడంలేదని ఆరా తీస్తే.. మెటీరియల్ కాంట్రాక్టర్ ‘సమర్పించుకోవాల్సింది’ ఇంకా సమర్పించుకోలేదట. కనీసం 5 శాతమైనా లేకపోతే ఎలా అని ఒకరిద్దరు అధికారులు, ఓ కీలక నేత దీన్ని ఆపివేయించినట్టు చెప్తున్నారు. మెటీరియల్ రాకపోతే పనులెలా చేసేదని కింది స్థాయి సిబ్బంది లబోదిబోమంటున్నారు.
విద్యుత్తు శాఖలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు డబ్బులు ఇవ్వనిదే పని జరగదన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. దీనికి బలం చేకూర్చేలా ఇటీవల ఒక సంఘటన జరిగిందని అధికారులు చెప్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓ అధికారి అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. ఆయనపై ఏసీబీ విచారణ ముగియకముందే ఆ అధికారి స్థానంలో జెట్ స్పీడ్‌తో మరో అధికారికి ఉత్తర్వులు ఇచ్చారు. ఏసీబీకి చిక్కిన అధికారి సస్పెన్షన్ ఉత్తర్వులు రాకముందే, ఏసీబీ పంచనామా ముగియక ముందే మరో అధికారికి పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.