Mancherial | మంచిర్యాల, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మీ భూముల్లో ఐటీ, ఇండస్ట్రియల్ పార్క్ వస్తున్నది. ఆ భూములన్నీ గతంలో మీకు మా ప్రభుత్వం అసైన్డ్ చేసినవే.. ఎకరాకు రూ.13.50 లక్షలు ఇస్తం. ఆ భూములు ఇచ్చేయండి. మర్యాదగా ఇచ్చింది తీసుకొని భూమిలిస్తే డబ్బులు మీ అకౌంట్లో పడుతయి. కాదూ కూడదంటే ఆ భూములు ఎట్ల తీసుకోవాల్నో అట్ల తీసుకుంటం. అసైన్డ్ భూములను ప్రజాప్రయోజనాల కోసం తిరిగి వెనక్కి తీసుకొనే అధికారం మాకున్నది. మేమిచ్చే ధరకు ఇవ్వకుంటే ఆయింత కూడా రాకుండా పోతది’ అంటూ అధికార పార్టీ లీడర్లు అమాయక దళిత రైతులను బెదిరించారు. అధికారుల సమక్షంలో బెదిరిండంతో ఏం చేయాలో పాలుపోక ఇష్టం లేకున్నా బలవంతంగా సంతకాలు చేశామంటూ మంచిర్యాల జిల్లా హజీపూర్ మండల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మండలంలోని వేంపల్లిలో సర్వే నంబర్లు 155, 156, 157, 158, 159, 160లోని అసైన్డ్ భూములు, పోచంపాడు లోని సర్వే నంబర్లు 1, 2, 8, 9, 10లోని సీలింగ్ అసైన్డ్ భూములు మొత్తం కలిపి 276.09 ఎకరాలను ఐటీ, ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరించాలని టీఐఐసీఎల్ (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) ఆదేశించింది. ఈ మేరకు భూ సేకరణ అధికారిగా ఆర్డీవోను మంచిర్యాల కలెక్టర్ నియమించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, స్థానిక అధికార పార్టీ లీడర్ల రంగ ప్రవేశంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రైతులను భయభ్రాంతులకు గురిచేసి, బలవంతంగా సంతకాలు తీసుకోవడం వెనుక పెద్ద కుట్రకు కాంగ్రెస్ లీడర్లు ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది.
13.50 లక్షలిచ్చి.. మిగతా కొట్టేసేందుకు ప్లాన్
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006లో ఇదే హజీపూర్ మండలంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కోసం భూ సేకరణ చేశారు. ఇందులో భూములు, ఇండ్లు కోల్పోయిన వారికి పరిహారం ఇచ్చే క్రమంలో స్థానిక నాయకులు ఇలాగే జోక్యం చేసుకున్నారు. రైతులతో ముందే మాట్లాడుకొని వచ్చే పరిహారంలో 30 శాతానికి చెక్కులు రాయించుకున్నారు. ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో రైతులతో అకౌంట్లు ఓపెన్ చేయించి, పరిహారం పడగానే ముందే రాయించి పెట్టుకున్న చెక్కుల ద్వారా డబ్బులను లీడర్ల అకౌంట్లలోకి మళ్లించుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో ఇండస్ట్రియల్ హబ్ పరిహారాన్ని కొట్టేసేందుకు సిద్ధమవుతున్నట్టు స్పష్టమవుతున్నది. కాకపోతే ఈ సారి తక్కువ మొత్తం రైతులకిచ్చి ఎక్కువ మొత్తం కొట్టేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని స్థానిక రైతులు చెప్తున్నారు. వాస్తవానికి భూ సేకరణ చట్టం 2013 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో భూ సేకరణ చేసినప్పుడు సేల్ డీడ్ వ్యాల్యూ (రిజిస్ట్రేషన్ వ్యాల్యూ)ను పరిగణలోకి తీసుకోవాలి.
భూమి సేకరించే ప్రాంతం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో గడిచిన మూడేళ్లలో ఎక్కువ రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఎంత ఉన్నదో అదే ధరను కోల్పోయే భూములకు నిర్ణయించాలి. ఇలా ఎక్కువ ఉన్న ధరకు మూడు రెట్లు కలిపి వచ్చే మొత్తానికి అదనంగా 100 శాతం సొలాటియం ఇవ్వాలి. ఈ లెక్కన ధరణి వెబ్సైట్లో పోచంపాడు, వేంపల్లిలో ఐటీ హబ్ కోసం తీసుకుంటున్న భూముల విలువ రూ.4.50 లక్షల నుంచి రూ.12.60 లక్షల వరకు చూపిస్తున్నది. నిబంధనల ప్రకారం ఎక్కువ ధర రూ.12.60 చొప్పున ఎకరాకు చెల్లించాలి. ఇలా మార్కెట్ విలువ ఎకరాకు రూ.12.60 లక్షలను మూడు రెట్లు చేస్తే రూ.50.4 లక్షలు అవుతుంది. దానికి సొలాటియం వంద శాతం కలిపితే ఎకరం ధర రూ.కోటి దాటి పోతున్నది. కానీ రైతులకు ఇప్పుడు ఎకరాకు రూ.13.50 లక్షలిచ్చి, ప్రభుత్వం నుంచి వచ్చే మిగిలిన పరిహారాన్ని తమ ఖాతాల్లోకి మళ్లించుకునేందుకు అధికార పార్టీ నాయకులు స్కెచ్ వేశారని స్థానిక రైతులు మండిపడుతున్నారు.
ఫంక్షన్హాల్లో రహస్య మీటింగ్!
ఈ కుట్ర మొత్తం నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లోనే జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు కోల్పోతున్న రైతులను ముల్కల్ల, వేంపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యనేత అనుచరులు మంచిర్యాలలోని ముఖ్యనేత ఇంటికే పిలిపించి బేరమాడినట్టు సమాచారం. ఈ సమావేశంలో ‘ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు ఇస్తం. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వ్యాల్యూ కూడా మీ దగ్గర అంతే ఉన్నది. అదేదో మేమే ఇస్తం. భూములు ఇచ్చేయాలి’ అని ప్రతిపాదనలు పెట్టగా దీనికి కొందరు రైతులు ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో ఈ నెల 5న గోదావరి రోడ్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో రైతులతో రహస్యంగా మీటింగ్ ఏర్పాటు చేశారు. రైతులందర్నీ పిలిపించి ఫంక్షన్ హాల్ డోర్లు మూయించి ఆ ఇద్దరు లీడర్లు మాట్లాడారు. ‘ఫైనల్‌గా ఎకరాకు రూ.13.50 లక్షలు ఇస్తం. ఎలా చూసినా మీకు అంత కంటే ఎక్కువ ధర రాదు.. మర్యాదగా మా మాట విని భూములిస్తే మీకే మంచిది. లేకపోతే అవి అసైన్డ్ భూములు కాబట్టి వాటిని ఎలాగైనా వెనక్కి తీసుకుంటం’ అని బెదిరించారని రైతులు చెప్తున్నారు. ‘ఐటీ పార్క్‌లో భూములు కోల్పోయే రైతులకు కుటుంబానికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నరు. అంతకంటే ఎక్కువ ఏం ఇచ్చేది లేదని చెప్పిండ్రు. ఆ సమావేశంలోనే భూములు ఇచ్చేందుకు మాకు అభ్యంతరం లేదని జీ-3, జీ-4 ఫామ్స్‌పై సంతకాలు చేయించుకున్నరు. మాకు ఇష్టంలేకున్నా ఎదురు మాట్లాడితే ఏమవుతుందోనన్న భయానికి సంతకాలు చేసినం’ అని బాధిత రైతులు వాపోతున్నారు.
నిబంధనలు తుంగలో..
ఈ అనధికారిక సంతకాల సేకరణ కార్యక్రమానికి ఎమ్మార్వో, ఆర్డీవో సైతం హాజరై నడిపించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. 2013 భూ సేకరణ చట్టం నిబంధనల ప్రకారం భూ సేకరణ చేయాలంటే ముందు నోటిఫికేషన్ జారీ చేయాలి. అనంతరం గ్రామ సభ నిర్వహించి బాధిత రైతుల ఆమోదం తీసుకోవాలి. మెజార్టీ రైతుల ఆమోదం తీసుకున్నాక సోషల్ ఇంపాక్ట్ సర్వే చేసి పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులూ లేవని నిర్ధారించుకున్నాకే భూ సేకరణ చేయాలి. కానీ ఇక్కడ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే అధికార పార్టీ నాయకులు బలవంతంగా రైతులనుంచి సంతకాలు సేకరించారు.
ఆ కాగితాలు వెనక్కివ్వాలి
ఐటీ పార్క్‌కు మేం వ్యతిరేకం కాదు. చట్ట ప్రకారం పరిహారం ఇచ్చి భూములు తీసుకోండి. దళారులు వచ్చి తక్కువ ధరకు భూములివ్వాలంటే ఎందుకిస్తం? రైతులతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. నన్ను కూడా రమ్మంటే పోలేదు. అది అధికారిక సమావేశమా? అనధికారిక సమావేశమా? అని ఎమ్మార్వోకు ఆర్టీఐ పెట్టిన. ఇప్పటి దాకా సమాధానం లేదు. రైతులను బెదిరించి సంతకాలు తీసుకున్న కాగితాలను వెనక్కివ్వాలి. అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పులున్నయి. ఉత్తగనే తిగిరి తీసుకునే అధికారం ఉన్నదని రైతులను బెదిరిస్తే నడవదు. భూ సేకరణ చేయాల్సి వస్తే అధికారికంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. అధికారులు నేరుగా రైతులతో మాట్లాడాలి. పరిహారం రైతులకే అందించాలి.
– దొమ్మటి అర్జున్, పోచంపాడు
బెదిరించి సంతకాలు తీసుకున్నరు
మాకు 2009లో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో కొందరికి 25 గుంటలు, మరికొందరికి 20 గుంటల చొప్పున భూమి ఇచ్చారు. 15 ఏండ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటూ బతుకుతున్నం. రెండు నెలలుగా మా భూమిని ఐటీ పార్క్ కోసం అడుగుతున్నరు. ఈ నెల 5న ముల్కల్ల బడా లీడర్లు మమ్మల్ని బెదిరించి ఫంక్షన్ హాల్లో మీటింగ్‌కు తీస్కపోయిండ్రు. . మీరు ఇస్తే భూమికి పరిహారం వస్తది. లేకపోతే ఏం వచ్చేది ఉండదని బెదిరించిండ్రు.
-గజ్జెల్లి రాజశేఖర్, రైతు, పోచంపాడు
మా పిల్లల భవిష్యత్తు నాశనం చెయ్యద్దు
పోచంపాడులో మాకు 20 గుంటల అసైన్డ్ భూమి ఉన్నది. ఇక్కడ ఏదో పార్క్ పడుతది.. పిల్లలకు జాబులు ఇస్తమని కాంగ్రెసోళ్లు లేని ఆశ పెడుతున్నరు. ఐదో తేదీన మంచిర్యాల పద్మనాయక ఫంక్షన్ హాల్లో మీటింగ్ అని చెప్పి తీస్కపోయిండ్రు. అక్కడ పది మంది రైతులను పక్కకు పిలిచి ఏదో మాట్లాడి వాళ్లతో సంతకాలు తీసుకున్నరు. వాళ్లు పెట్టినప్పుడు మీరెందుకు పెట్టరని బెదిరించే సరికి నేను సంతకం పెట్టిన. మమ్ములను మోసం చేసి సంతకాలు పెట్టించుకున్నరు. భూమి గుంజుకొని మా పిల్లల భవిష్యత్తును నాశనం చెయ్యద్దు.
– రాపల్లి సుమలత, రైతు, పోచంపాడు
నిబంధనలు పాటిస్తాం
ఐటీ పార్క్ కోసం భూ సేకరణ విషయంలో నిబంధనలు తప్పకుండా పాటిస్తాం. రైతుల కోరిక మేరకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తా. ప్రస్తుతం ఈ భూముల్లో ఎంజాయిమెంట్ సర్వే చేస్తున్నం. ఆ సర్వేలో ఏ రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నాయని గుర్తించాక దాన్ని అనుసరించి నోటిఫికేషన్ జారీ చేస్తం. రైతులతో మాట్లాడి ఎంత పరిహారం ఇవ్వాల్సి వస్తది? దానికి ఎంత బడ్జెట్ కావాలనే రిపోర్ట్ ఉన్నతాధికారులకు పంపిస్తం. ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురండి. అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటం.
-కుమార్ దీపక్, మంచిర్యాల కలెక్టర్