హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి దొడ్డిదారిలో డ్రగ్స్ చొరబడుతున్నాయి. మారుమూల గ్రామాల్లోనూ గంజాయి పాతుకుపోతున్నది. దీనికితోడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గుడుంబా వాసన మళ్లీ గుప్పుమంటున్నది. ఇటీవల తమిళనాడులో కల్తీసారా తాగి 50 మంది వరకు చనిపోయారు. దీంతో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ రంగంలోకి దిగింది.
డ్రగ్స్, సారా రహిత తెలంగాణ కోసం నిఘా మరింత పెంచింది. ఎక్కడికక్కడ ముప్పేట దాడులు చేస్తున్నది. క్షేత్రస్థాయి నుంచి సమాచార వ్యవస్థను పటిష్టం చేస్తూ డ్రగ్స్, సారా విక్రేతలను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం జరుగుతున్నా, నాటు సారా తయారీ జరుగుతున్నా సమాచారం తెలుసుకోగలుగుతున్నారు. పట్టుబడిన మాదకద్రవ్యాలు, నాటుసారా తయారీదారులపై ఉకుపాదం మోపుతున్నారు.
గంజాయి బ్యాచ్‌లపై నిఘా
పచ్చని పల్లెల్లోని యువతను గంజాయి నిర్వీర్యం చేస్తున్నది. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా ఇప్పుడు ఐదారు గంజాయి బ్యాచ్‌లు దర్శనమిస్తున్నాయి. వీటిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులే గంజాయికి అలవాటు పడుతుండటం ఆందోళన కలిగించే అంశం. దీంతో ఎక్సైజ్‌శాఖ గ్రామాల్లో సైతం గంజాయి బ్యాచ్‌లపై నిఘా పెట్టింది. కేవలం ఆరు నెలల్లో సుమారు 2,680 కిలోల గంజాయి, 92 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నది.
440 గంజాయి మొక్కలు ధ్వంసం చేసింది. 2 కిలోల హషీష్ ఆయిల్, కేజీన్నర గంజాయి లిక్విడ్, 117 గ్రాముల చరాస్, 1,236 కేజీల పప్పీస్ట్రా, 6 కేజీల ఓపీఎం, 101 కేజీల ఎంఎంసీ, 348 గ్రాముల ఎండీఎంఏ, 37 ఎల్ఎస్డీ బ్లాట్స్, 10 కేజీల ఆల్ఫ్రాజోలం, 10 కేజీల ఆల్ఫ్రాజోలం ట్యాబ్లెట్లను అధికారులు పట్టుకున్నారు. మొత్తం 500 కేసులు నమోదు చేసి, 725 మందిని అదుపులోకి తీసుకున్నారు.
సాంకేతికత వినియోగంతో పెరిగిన అరెస్టులు
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అడ్డుకట్టకు ఎక్సైజ్ శాఖ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నది. అక్రమ రవాణా దారుల ఆచూకీ తెలుసుకొని, వారిని అరెస్టు చేస్తున్నది. దీంతో మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులు, నాటు సారా తయారీదారులు ఉకిరి బికిరి అవుతున్నారు. వచ్చే ఆగస్టు నాటికి రాష్ట్రం నుంచి సారా మహమ్మారిని పారదోలాలన్న లక్ష్యంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నది. ఆసిఫాబాద్, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో చాటుమాటుగా తయారు చేస్తున్న వ్యక్తులపై నిఘా పెట్టింది. ఈ ఏడాది మే నాటికి 12,734 నాటుసారా కేసులు నమోదు కాగా, 5,398 మంది తయారీదారులను అరెస్ట్ చేసింది.
మత్తు మహమ్మారిని పారదోలుదాం

ఎక్సైజ్‌శాఖ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన పెరిగింది. వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సారాతయారీపై సమాచారం ఇస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనల మేరకు పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది సమన్వయంతో అన్ని గ్రామాల్లో డ్రగ్స్ నిర్మూలన కమిటీలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. సమాచారం ఇచ్చేవారి సంఖ్య మరింత పెరగాలి. అప్పుడే డ్రగ్స్, సారా, మత్తు రహిత తెలంగాణను చూడగలం. ఎక్సైజ్‌శాఖ మాదకద్రవ్యాల వినియోగాన్ని, అక్రమ రవాణాను అరికట్టేందుకు దృఢనిశ్చయంతో ఉన్నది. అందరం కలిసి మత్తు మహమ్మారిని పారదోలదాం.
– వీబీ కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్