హైదరాబాద్, జూన్3 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ఘోరంగా విఫలమవుతున్నది. గత 2025-26 నీటి సంవత్సరంలో మొత్తంగా 271 టీఎంసీలు (25 శాతం) మాత్రమే వాడుకోగలిగింది. గత పన్నెండేండ్లలో ఇదే అత్యంత తక్కువ. ఏపీ మాత్రం గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 777 టీఎంసీలను తరలించుకుపోయింది. తన కోటాకు మించి 43 టీఎంసీలను వాడుకున్నది. శ్రీశైలం నుంచి మునుపెన్నడూ లేనివిధంగా 253 టీఎంసీలను మళ్లించుకుపోయి రికార్డు బ్రేక్ చేసింది. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణం.
కాంగ్రెస్ హయాంలోనే అత్యంత కనిష్ఠం
తెలంగాణ ఏర్పాటు తర్వాత కృష్ణా జలాలను అత్యంత కనిష్ఠంగా వినియోగించుకున్నది కాంగ్రెస్ హయాంలోనే. కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులకు వచ్చిన జలాలను తాత్కాలిక కోటా మేరకు ఏపీ, తెలంగాణ 66:34 నిష్పత్తిలో వినియోగించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజనకు ముందు కృష్ణా జలాల్లో తెలంగాణ సగటు వినియోగం 228 టీఎంసీలు మాత్రమే. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయతోపాటు పలు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌లను పూర్తిచేయడంతో తెలంగాణలోనూ కృష్ణా జలాల వినియోగం పెరిగింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేండ్లలో సగటు వినియోగం 228 టీఎంసీల నుంచి 284 టీఎంసీలకు చేరుకున్నది. ముఖ్యంగా 2019-20 నీటి సంవత్సరంలో ఏకంగా 367 టీఎంసీల నీటిని వినియోగించుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మళ్లీ తారుమారైంది. ఫలితంగా 2024-25 నీటి సంవత్సరంలో కేవలం 26% జలాలను మాత్రమే వినియోగించుకోగలిగిన తెలంగాణ.. 2025-26లో మరింత తక్కువగా 25.10% జలాల వినియోగానికే పరిమితమైంది.
ఏటా ఏపీ కొత్త రికార్డులు
కృష్ణా జలాల వినియోగంలో ఏటా సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న ఏపీ 2024-25లో 72%, 2025-26లో ఏకంగా 74.90% (777 టీఎంసీలు) తరలించుకుపోయింది. శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్ నుంచి ఏపీకి చెందిన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ (పీఆర్పీ), తెలుగు గంగ ప్రాజెక్టు (టీజీపీ), ఎస్ఆర్బీసీ (శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్), మల్యాల, ముచ్చమర్రి లిఫ్ట్‌లు ఉన్నాయి. వాటిలో టీజీపీకి 15 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు కలిపి మొత్తంగా 34 టీఎంసీల నీటి కేటాయింపులు మాత్రమే ఉన్నాయి. కానీ, గత పన్నెండేండ్లలో ఎన్నడూ లేనివిధంగా ఏపీ కేవలం శ్రీశైలం నుంచే 253 టీఎంసీలను తన్నుకుపోయింది. వాటిలో పీఆర్పీ ద్వారానే 197 టీఎంసీలను కొల్లగొట్టింది.
కాంగ్రెస్ వైఫల్యమే కారణం
2025-26 నీటి సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురువడంతో రా్రష్ట్ర సాధారణ సగటు కంటే 97% అధిక వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఎగువ నుంచి కృష్ణాలో నిరుడు నవంబర్ మాసాంతం వరకు వరద ప్రవాహాలు కొనసాగాయి. బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులు నీటితో కళకళలాడాయి. దీంతో పలుమార్లు క్రస్ట్ గేట్లను ఎత్తాల్సి వచ్చింది. ప్రతి నీటి సంవత్సరం (జూన్ నుంచి మే 31 వరకు) ఉమ్మడి రిజర్వాయర్లలోని నిల్వలను ఏ రాష్ట్రం ఏ మేరకు వినియోగించుకోవాలనేది కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తూ వస్తున్నది. బోర్డు మెంబర్ సెక్రటరీ, ఇరు రాష్ర్టాల ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)లతో కూడిన ఈ కమిటీ ఏటా సీజన్లవారీగా ఎప్పటికప్పుడు సమావేశమై రాష్ర్టాల డిమాండ్లు, అందుబాటులో ఉన్న నీటినిల్వల ఆధారంగా వాటాలను కేటాయిస్తుంది. ఆ మేరకు ప్రాజెక్టుల ఔట్లెట్ల నుంచి నిర్ణీత సమయంలో నీటిని విడుదల చేస్తుంది.
కానీ, 2025-26 నీటి సంవత్సరం ముగిసే వరకు త్రిసభ్య కమిటీ సమావేశం కాలేదు. కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు కేఆర్ఎంబీ ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదు. కానీ, ఏపీ మాత్రం ఎలాంటి ఇండెంట్లు లేకుండా జూన్ నుంచే కృష్ణా జలాలను కొల్లగొట్టింది. పోతిరెడ్డిపాడు నుంచి యథేచ్ఛగా నీటి మళ్లింపు చేపట్టింది. ఆ తర్వాత నీటి సంవత్సరం ముగియడానికి కేవలం 15 రోజుల ముందు త్రిసభ్య కమిటీ తూతూమంత్రంగా సమావేశమైంది. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి సర్కార్ ఇదేమిటని అడుగలేదు. తెలంగాణకు సంబంధించిన పూర్తి కోటా జలాలను వినియోగించుకోవడంపై దృష్టి పెట్టలేదు. వాస్తవానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాలువకు సంబంధించిన చిన్నపాటి పెండింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసి ఉంటే ఇప్పటికే అదనంగా మరో 45 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం తెలంగాణకు దక్కేది. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం వల్ల ప్రస్తుతం తెలంగాణ కోటాలో 106 టీఎంసీలు వాడకుండా మిగిలిపోయాయి.
ఔట్లెట్ల వారీగా ఏపీ మళ్లించిన జలాలు
ఔట్లెట్ టీఎంసీలు
తెలంగాణ వాడుకున్న జలాలు..
ఔట్లెట్ టీఎంసీలు
