హైదరాబాద్, జూన్28 (నమస్తే తెలంగాణ): నిన్నమొన్నటి వరకు గురుకులాల్లో సీటు కోసం విపరీతమైన పోటీ ఉండేది. సీవోఈ గురుకులాల్లో అడ్మిషన్ దొరకడం గగనమే. ఇప్పుడీ పరిస్థితి మారింది. కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే పరిస్థితి తారుమారైంది. ఈ ఏడాది ఇంటర్ కాలేజీల్లో 25 శాతం సీట్లు కూడా నిండని దుస్థితి నెలకొన్నది. సాధారణ గురుకులాలతోపాటు సీవోఈల్లోనూ అదే పరిస్థితి నెలకొన్నది. ఈ విద్యాసంవత్సరం సొసైటీ తీసుకున్న నిర్ణయాలే దీనంతటికీ కారణమని గురుకుల యూనియన్లు విమర్శిస్తున్నాయి. అంతేకాదు సొసైటీ నిర్ణయాల మూలంగా ఇప్పటికే అడ్మిషన్ పొందిన విద్యార్థులు సైతం తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్తున్నారు. ఇది టీచర్లను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదని అంటున్నారు.
ఎస్సీ గురుకుల పరిధిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ), సాధారణ ఇంటర్, ఒకేషనల్ జూనియర్ కాలేజీలు కలిపి మొత్తంగా 238 గురుకులాలు ఉన్నాయి. అన్ని గ్రూపులు కలిపి 19,490 సీట్లు ఉన్నాయి. అత్యధికంగా ఎంపీసీకి 8,360, బైపీసీకి 7,880 సీట్లు ఉండగా, మిగతావి ఎంఈసీ, సీఈసీ గ్రూపులవి. ఏప్రిల్‌లో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటికే తొలిదశలో అన్ని సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసి అలాట్మెంట్ ఆర్డర్లను సొసైటీ జారీచేసింది. కానీ ఇప్పటి వరకు 25 శాతం మంది విద్యార్థులు కూడా అడ్మిషన్ పొందలేదని తెలుస్తున్నది. చేరిన వారిలోనూ చాలామంది కేవలం జిరాక్స్ పత్రాలను మాత్రమే సమర్పించి వెళ్లారు తప్ప పూర్తిస్థాయిలో అడ్మిషన్ పొందలేదని గురుకుల ప్రిన్సిపాళ్లు చెప్తున్నారు. నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ల్లో ఈ ఏడాది సీట్లు పూర్తిగా భర్తీ కాలేదు. పలు సీవోఈల్లో కేవలం ఒకరిద్దరు మాత్రమే ప్రవేశాలను పొందారు. ఈ నేపథ్యంలో తాజాగా సొసైటీ మరో జాబితా విడుదలకు సిద్ధమవుతున్నది.
గురుకుల ఇంటర్ ప్రవేశాలు పూర్తిగా పడిపోవడానికి, విద్యార్థులు విముఖత చూపేందుకు ప్రధాన కారణం ఎస్సీ గురుకుల సొసైటీ ఇష్టారీతిన తీసుకున్న నిర్ణయాలేనని గురుకుల సిబ్బంది వెల్లడిస్తున్నారు. గతంలో సీవోఈ ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో రాత పరీక్ష నిర్వహించి ప్రతిభకలిగిన విద్యార్థులను ఎంపిక చేసేవారు. కానీ ఈ ఏడాది రాతపరీక్షను రద్దు చేశారు. సొసైటీ విద్యార్థులకే సీవోఈల్లో ప్రవేశాలను కల్పించింది. గతంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులను కూడా ఇంటర్ మొదటి సంవత్సరంలో మార్కులు సరిగా సాధించలేదని చెప్పి ఇతర సాధారణ గురుకులాలకు మార్చారు. ఇక నాన్ సీవోఈ, ఒకేషనల్ గురుకుల కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియను కూడా అడ్డదిడ్డంగా చేపట్టారు. దాదాపు 80 గురుకుల కాలేజీల్లో గ్రూపులన్నీ మార్చారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీతోపాటు, ఒకేషనల్ కోర్సుల్లోనూ మార్పుచేర్పులు చేశారు. కొన్ని కాలేజీలను కేవలం సైన్స్ గ్రూపులకు, మరికొన్ని కాలేజీలను ఆర్ట్స్ గ్రూపులకు పరిమితం చేశారు. మరికొన్నింటిలో మిశ్రమ కోర్సులు రన్ చేయాలని నిర్ణయించారు. ఇంటర్ కాలేజీల అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులకు ఇవేవీ వెల్లడించలేదు. వాస్తవంగా గతంలో దరఖాస్తులు స్వీకరించే సమయంలో సదరు విద్యార్థికి ఏ జిల్లాలో? ఎక్కడ ఏ కాలేజీలో, ఏ గ్రూపులో సీటు పొందాలనుకుంటున్నాడు? అనే అంశాలపై ప్రాధాన్యతపరంగా ఆప్షన్ ఎంచుకునే అవకాశముండేది. విద్యార్థులు కూడా ఆయా కాలేజీల్లోని వసతులు, ఉత్తీర్ణతతోపాటు, దూరభారం లేని కాలేజీలను ఎంపిక చేసుకుని ఆ విధంగానే దరఖాస్తులు తీసుకునేవారు. కానీ ప్రస్తుతం తీసుకునే గ్రూపు తప్ప కాలేజీని ఎంచుకునే అవకాశాన్ని సొసైటీ దరఖాస్తు సమయంలో ఇవ్వలేదు. సొసైటీనే మెరిట్ ఆధారంగా ఇష్టారీతిన విద్యార్థులకు ఆయా కాలేజీలకు కేటాయించింది. ఖమ్మం జిల్లావిద్యార్థులకు వరంగల్‌లో, వరంగల్ విద్యార్థులకు నల్లగొండలో, మహబూబ్‌నగర్ విద్యార్థులకు హైదరాబాద్.. ఇలా పొంతన లేకుండా సుదూర ప్రాంతాల్లో సీట్లను కేటాయించింది. ఈ కారణంగానే విద్యార్థులు అడ్మిషన్‌కు విముఖత చూపుతున్నారని తెలిసింది. ఇప్పటివరకు అడ్మిషన్ పొందిన వారు కూడా తమ సొంతజిల్లాలకే బదిలీ పెట్టుకుంటున్నారని సమాచారం. ఫలితంగా 25 శాతం సీట్లు కూడా నిండని దుస్థితి నెలకొన్నది.
బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఆమోదం లేకుండానే ఎస్సీ గురుకుల సొసైటీ ఇష్టారీతిన సొంత నిర్ణయాలను తీసుకుంటున్నదని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. సంవత్సరంలో బీజీ నాలుగు సార్లయినా సమావేశం కావాల్సి ఉంటుంది. అకడమిక్ అంశాలు, కాలేజీల ఏర్పాటు, కుదింపు, గ్రూపుల ఏర్పాటుతోపాటు, సొసైటీకి సంబంధించిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలు తదితర అంశాలపై బీజీలోనే చర్చించి తీర్మానం చేయడం పరిపాటి. ఒకవేళ అత్యవసరమైతే ప్రభుత్వం అనుమతి తీసుకుని విధానపరమైన అంశాలను సొసైటీ అమలు చేయవచ్చు. కానీ ప్రస్తుతం అటు ప్రభుత్వం అనుమతి కానీ, ఇటు బీజీలో కానీ చర్చించకుండానే సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారని యూనియన్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. గత మూడేండ్లలో ఒక్కసారి కూడా బీజీ సమావేశం కాలేదని, అయినా అనేక విధానపరమైన నిర్ణయాలను సొసైటీనే సొంతంగా, ఏకపక్షంగా అమలు చేస్తున్నదని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తక్షణం జోక్యం చేసుకోవాలని, ఎస్సీ సొసైటీ కార్యకలాపాలపై దృష్టి సారించాలని, తప్పుడు నిర్ణయాలను సవరించాలని తల్లిదండ్రులు, గురుకుల ఉపాధ్యాయ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి.
మెరిట్ రాలేదని సీవోఈల్లోని విద్యార్థులను సొసైటీ వేరే కాలేజీలకు మార్చింది. దీంతో సదరు విద్యార్థులు మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. తల్లిదండ్రులను విడిచి సుదూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మరోవైపు సొసైటీ నిర్ణయాలతో తీవ్ర అవస్థలు పడుతున్నామని గురుకుల టీచర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ప్రమోషన్లను, బదిలీకి అవకాశం ఏర్పడిందని, కానీ ఆ ఆనందాన్ని లేకుండా చేశారని వాపోతున్నారు. ఇటీవల కాలేజీల్లో గ్రూపులను ఇష్టారీతిన మార్చారని వివరిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయా కాలేజీల్లోని సిబ్బందిని సైతం డిప్యుటేషన్లపై మళ్లీ ఇతర కాలేజీలకు బదలాయిస్తున్నారని వివరిస్తున్నారు. మార్చిన గ్రూపులకు అనుగుణంగా 89 మంది జూనియర్ లెక్చరర్లను డిప్యుటేషన్లపై నియమించారని గుర్తుచేస్తున్నారు. కుటుంబపరంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నామని గురుకుల టీచర్లు వాపోతున్నారు. బదిలీ పొందిన ఆనందం లేకుండా చేశారని మండిపడుతున్నారు.