హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి రుణ సమీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ నెల 15న రిజర్వు బ్యాంకు నిర్వహించనున్న ఈ వేలంలో రూ.2500 కోట్లు రుణం తీసుకోనున్నది. ఈ మేరకు ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థికశాఖ వేలానికి సెక్యూరిటీ బాండ్లను పెట్టింది. రూ.1,000 కోట్లు 32 ఏండ్ల కాలానికి, మరో రూ.1,000 కోట్లు 35 ఏండ్ల కాలానికి, ఇంకో రూ.500 కోట్లు 38 ఏండ్ల కాలానికి రుణం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టినట్టు ఆర్బీఐ వెల్లడించింది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు రెండో త్రైమాసికంలో ప్రతివారం ఇంత రుణం తీసుకుంటామని వెల్లడిస్తూ ఆర్బీఐకి గత నెలలోనే ఆర్థికశాఖ ప్రతిపాదనలు పంపించింది.
ఆ ప్రతిపాదనల ప్రకారం.. జూలై 15న రూ.1000 కోట్లు తీసుకుంటామని ఆర్థికశాఖ తెలిపింది. మొత్తంగా రూ.2,500 కోట్లు తీసుకుంటామని తెలపడంతో ఆ మేరకు ప్రభుత్వ సెక్యూరిటీ బాం డ్లను వేలం వేయబోతున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.14 వేల కోట్లు, రెండో త్రైమాజికంలో రూ.12,000 కోట్లు రుణం తీసుకుంటామని ఆర్థికశాఖ ప్రతిపాదనలు పంపించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల కింద రూ.64,539 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు.