Krishna Water | హైదరాబాద్, మార్చి20 (నమస్తే తెలంగాణ ) : పట్టించుకోని కేఆర్ఎంబీ, పట్టింపేలేని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ వైఖరితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జలాలను అడ్డూఅదుపు లేకుండా తరలించుకుపోతున్నది. సాగర్ కుడికాలువ ద్వారా రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున కోటాకు మించి 52 టీఎంసీల నీటిని అదనంగా కొల్లగొట్టింది. నికర జలాల నిర్ధారణ కోసం కేఆర్ఎంబీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి నాటి నుంచి ఇప్పటి వరకు 25 రోజుల్లో అదనంగా మరో 25 టీఎంసీల నీటిని ఏపీ నిరాటంకంగా తరలించుకుపోయింది. ఫలితంగా తెలంగాణకు సాగు, తాగునీటి గండం పొంచి ఉన్నది. జలాల వినియోగాన్ని కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) పట్టించుకోకపోవడం, ఇక్కడి కాంగ్రెస్ సర్కారు సైతం నోరుమెదకపోవడంతో ఏపీ ఇష్టారీతిన జలాలను తరలించుకుపోతున్నది. సాగర్ కుడి కాలువ కింద ఏపీకి వాస్తవంగా 132 టీఎంసీల జలాల కేటాయింపు ఉన్నది.
కానీ ఇప్పటికే ఎన్నడూ లేనివిధంగా 180 టీఎంసీల కృష్ణా జలాలను మళ్లించింది. కోటాకు మించి 52 టీఎంసీలను అధికంగా కొల్లగొట్టింది. కాలువ పూర్తిస్థాయి సామర్థ్యం 9,000 క్యూసెక్కులు, పవర్‌హౌస్ నుంచి అదనంగా 5,000 క్యూసెక్కులు నికరకంగా రోజుకు 14,000 క్యూసెక్కుల (ఒక టీఎంసీన్నర) మేరకు జలాలను ఏపీ మళ్లించింది. నవంబర్ నెలాఖరు నుంచే సాగర్ కుడికాలువ ద్వారా జలాల తరలింపు ప్రక్రియను ఏపీ ముమ్మరం చేసింది. బోర్డు ఫిబ్రవరి 27న నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఈ విషయమై చర్చ కొనసాగింది. ఆ సందర్భంగా కుడికాలువ నుంచి నీటి విడుదలను తగ్గించాలని ఏపీ బోర్డు నామమాత్రంగా సూచించింది. రోజుకు 5,000 క్యూసెక్కులనే డ్రా చేయాలని చెప్పి చేతులు దులుపుకున్నది. కానీ ఏపీ ఇప్పటివరకూ నీటి తరలింపును ఆపడమేలేదు. రోజుకు 8 వేల క్యూసెక్కులను సరఫరా చేసుకుంటున్నది. ఏపీ జలాల తరలింపును అడ్డుకోవాలని తెలంగాణ అధికారులు లేఖలు రాసినా బోర్డు కనీసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఎక్కడా నోరుమెదకపోవడం, అడ్డుచెప్పకపోవడంతోనే ఏపీ కోటాకు మించి నిరాటంకంగా ఇప్పటికీ సాగర్ నుంచి కృష్ణా జలాలను తరలించుకుపోతున్నది. ఈ ఏడాది యాసంగి ప్రారంభంలో త్రీమెంబర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బోర్డును కనీసం అడగనే లేదు. నవంబర్ నుంచే సాగర్ కుడి కాలువ నుంచి తన వాటాకు మించి ఏపీ నీటిని మళ్లిస్తున్నా తెలంగాణ సర్కారు మాత్రం చోద్యం చూస్తూ వచ్చింది. 15 రోజులకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించినా, ఇప్పటికీ దాదాపు నెలరోజులవుతున్న మళ్లీ దానిపై నోరెత్తడమే లేదు. తొలుత యాసంగి సీజన్‌కు 116 టీఎంసీలు కావాలని, ఆ తర్వాత 63 టీఎంసీలకు దిగివచ్చి తుదకు 40 టీఎంసీలనే సాధించింది. ఆ జలాలనైనా పూర్తిస్థాయిలో వినియోగించలేదు. ఈ వ్యవధిలోనే ఏపీ 25 రోజుల్లోనే 25 టీఎంసీలు తరలించిండమే కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి దర్పణం పడుతుంది.
గత ఫిబ్రవరి 27న నిర్వహించిన అత్యవసర సమావేంలో నీటివినియోగ వాటాలను కేఆర్ఎంబీ నిర్ణయించలేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో కలిపి 60 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయని, డిమాండ్ల మేరకు నీళ్లను ఇవ్వలేమని బోర్డు చేతులెత్తేసింది. అందుబాటులో ఉన్న నీటిని ఇరు రాష్ట్రాలే వివాదాలు లేకుండా వినియోగించుకోవాలని బాధ్యత నుంచి తప్పుకొని చేతులు దులుపుకున్నది. మొదట తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉచిత సలహాలు ఇచ్చింది. ఎవరికి ఎంత అవసరం ఉంటుందో ప్రతీ 15 రోజులకు ఒకసారి భేటీ కావాలని, ప్రణాళికతో ముందుకెళ్లాలని ఇరు రాష్ట్రాలకు సూచించి బోర్డు సమావేశాన్ని ముగించింది. కానీ ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు సమావేశాన్ని నిర్వహించనేలేదు. నీటి విడుదలను పర్యవేక్షించిన దాఖలాలూ లేవు. ఏపీ నీటిని తరలించుకుపోతున్నా బోర్డు మాత్రం చోద్యం చూస్తూ కూర్చున్నది.