Srinivas Goud | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గౌడ కులస్తులకు ఇచ్చిన హామీ ప్రకారం మద్యం దుకాణాల్లో 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గౌడ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గన్ పార్కు వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, కుల వృత్తులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. హైదరాబాద్‌లో కల్లుపై కుట్ర చేసి కల్లును బంద్ చేయడం జరిగింది. గొల్ల కరుమలకు రూ. 3లక్షలు ఇస్తామని చెప్పి రూ. 3 లక్షలు ఇవ్వలేదు, ఒక్క గొర్రె ఇవ్వలేదు. ముదిరాజ్‌లకు చేపలు ఇవ్వలేదు. తెలంగాణలో 2 సంవత్సరాలలో తాటి, ఈత చెట్లపై నుండి ప్రమాదానికి గురై, 1145 మంది గీత కార్మికులు చనిపోయారు, తక్షణమే వారి కుటుంబాలకు ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. హైదరాబాద్‌లో మూసివేసిన కల్లు దుకాణాలను వెంటనే తెరవాలి అని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి. వైన్ షాపులలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌడ కులస్తులకు 15 శాతం ఇస్తే, కాంగ్రెస్ పార్టీ 25 శాతం ఇస్తామని హామీ ఇచ్చింది. 25 శాతం హామీని ఇవ్వకుండా, 15 శాతం అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాము, వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సవరించి, గౌడ కులస్తులకు వైన్స్లలో 25 శాతం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. గౌడ్లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ్ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్, గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐలి వెంకన్న గౌడ్, గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, బీసీ సమైక్య అధ్యక్షులు ఎస్ . దుర్గయ్య గౌడ్, జీబిఎన్ చీకటి ప్రభాకర్ గౌడ్, దామోదర్ గౌడ్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.