హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతి నది పుషరాల ఏర్పాట్ల కోసం రూ. 25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. సరస్వతి నది పుషరాలకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో మౌలిక వసతుల కల్పనతో పాటు స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం తదితర పనులను పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్‌లను ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనులు చేపట్టాలని, పుషరాలను విజయవంతంగా నిర్వహించాలని ఆమె సూచించారు. తెలంగాణ ఏర్పాటుకు పూర్వం 2013లో సరస్వతి పుషరాలు జరిగాయి. స్వరాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఈసారి ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా ఘనంగా పుషరాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.