హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): త్వరలోనే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని ఆ పార్టీ మాజీ పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. శనివారం గాంధీభవన్‌లో మీడియా ఎదుట ఈ ప్రకటన చేశారు. ఉత్తమ్ ఫిరాయింపు వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరితో ఆటోమెటిక్‌గా అనర్హత వేటు పడేలా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో సవరణ తీసుకొస్తాం’ అని జాతీయ కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో కీలక హామీ ఇచ్చింది. అయితే తెలంగాణలో ఆ మ్యానిఫెస్టో విడుదలకుముందే ఆ హామీని తుంగ లో తొక్కుతూ మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఒకవైపు ఫిరాయింపులను నివారిస్తామంటూనే మరోవైపు ఫిరాయింపులను ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన హామీ తెలంగాణలో వర్తించదా? రాష్ట్ర కాంగ్రెస్‌కు అధిష్ఠానం ఆదేశాలు పట్టవా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్‌రెడ్డిని తమ పదవులకు రాజీనామా చేయించకుండానే కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నది. ఇప్పుడు మరో 25 మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారంటూ ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పూర్తిగా రాజకీయ విలువల్ని వదిలేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన, చేరబోయే వారిని రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.