కొలిక్కిరాని ఏపీ భవన్ విభజన
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ, ఏపీకి ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజన అంశం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు.
- ఏడో ప్రతిపాదనకూ పూర్తిగా సమ్మతించని ఏపీ
- తెలంగాణ సూచనకు పాక్షిక అంగీకారం
- నష్టమే అంటున్న అధికారులు
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ, ఏపీకి ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజన అంశం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. ఈ ఆస్తుల విభజనకు గత పదేండ్లలో వచ్చిన ఆరు ప్రతిపాదనలతోపాటు తాజాగా వచ్చిన ఏడో ప్రతిపాదనకు కూడా ఏపీ పూర్తిస్థాయి సమ్మతిని తెలుపలేదు. దీంతో ఇది కూడా అటకెక్కే అవకాశం ఉన్నది. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిపాదన చేస్తుందా? లేక చేతులెత్తేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలోని పాత ఏపీ భవన్ పంపకాల కోసం రెండు రాష్ర్టాల అధికారులతో ఇప్పటికే పలు భేటీలు నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఈ నెల 2న మరో సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీ తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. గతంలో ఏ ప్రతిపాదనపై ఇలా స్పందించని ఏపీ.. ఇప్పుడు వెంటనే స్పందించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి.
తెలంగాణకు 8 ఎకరాల 24 గుంటలు కేటాయించాలి
ఆస్తుల పంపకం సమస్యను త్వరగా పరిష్కరించాలని తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఈ నెల 8న కేంద్రానికి లేఖ రాశారు. ఢిల్లీ అశోకా రోడ్డులోని శబరి, స్వర్ణముఖి బ్లాక్‌లతోపాటు నర్సింగ్ హాస్టల్, పటౌడీ హౌజ్‌లో తెలంగాణకు వాటా ఉన్నదని పేర్కొన్నారు. చారిత్రక హైదరాబాద్ హౌజ్‌ను ఆనుకొని మూడెకరాల్లో ఉన్న శబరి బ్లాక్‌ను, పటౌడీ హౌజ్‌లో ఖాళీగా ఉన్న ఐదెకరాల 24 గుంటల స్థలాన్ని కలిపి తెలంగాణకు మొత్తం 8 ఎకరాల 24 గుంటలు కేటాయించాలని కోరారు. ఇది రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న 41.68 శాతానికి సమానమని తెలుపడంతో ఏపీ సైతం కొంత సానుకూలంగా స్పందించింది. కానీ, ఈ ప్రతిపాదన వల్ల తెలంగాణకే నష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వాస్తవానికి ఇక్కడ ఉన్న మొత్తం స్థలం తెలంగాణకే చెందుతుందన్న వాదన ఉన్నది. ఎందుకంటే.. హైదరాబాద్ హౌజ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకుని అందుకు ప్రత్యామ్నాయంగా ఈ స్థలాన్ని ఇచ్చింది. అందువల్ల ఈ మొత్తం స్థలాన్ని తెలంగాణకే ఇచ్చి ఏపీకి మరో చోట స్థలం కేటాయించాలన్న సూచనలు ఉన్నాయి. ఇది కుదరకపోతే అక్కడ ఉన్న స్థలంలో ఒకవైపు భాగాన్ని తెలంగాణకు, మరోవైపు భాగాన్ని ఏపీకి కేటాయిస్తే సరిపోతుందని అధికారులు చెప్తున్నారు.
ఏపీ అభ్యంతరాలు, షరతులు
ఢిల్లీలోని ఉమ్మడి ఆస్తులను పంపిణీ చేయాలని ఏపీ సైతం ఈ నెల 18న కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. భూ కేటాయింపులకు సంబంధించి తెలంగాణ చేసిన ప్రతిపాదనపై తమకున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. తెలంగాణ ప్రతిపాదించినట్టు భూమిని కేటాయిస్తే అందులో ఏపీకి ప్రత్యేకంగా ఒక రోడ్డు ఇవ్వాల్సి ఉంటుందని.. కానీ, ఆ రోడ్డులో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు దాదాపు రూ.250 కోట్లు అవసరమవుతాయని తెలిపింది. ఆక్రమణలు తొలగించకపోతే ఏపీకి కేటాయించే భూమిని వినియోగించుకోలేమని పేర్కొన్నది. ఒకవేళ ఆక్రమణలు తొలగించని పక్షంలో ఏపీకి శబరి, పటౌడీ హౌజ్ బ్లాక్‌లలో సమాన వాటా కేటాయించాలని డిమాండ్ చేసింది. ఈ షరతులకు ఒప్పుకుంటే కేంద్రం చేసిన ఏడో ప్రతిపాదన తమకు సమ్మతమేనని స్పష్టం చేసింది.
మొత్తం రూ.7,110 కోట్ల విలువైన భూములు
ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ మొత్తం విలువను రూ.7,110 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. 19.73 ఎకరాల్లో విస్తరించిన ఏపీ భవన్ భూమి విలువను రూ.7,089 కోట్లుగా, భవనం విలువను రూ.20.25 కోట్లుగా లెక్కగట్టింది. వీటిలో ఏపీకి 58.32%, తెలంగాణకు 41.68% ఆస్తులు పంపిణీ చేయాల్సి ఉన్నది. అంటే.. ఏపీకి రూ.4146.5 కోట్ల విలువైన 11.32 ఎకరాలు, తెలంగాణకు రూ.2963.5 కోట్ల విలువైన 8.40 ఎకరాల భూమి రావాల్సి ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

