హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 235 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇంటర్‌బోర్డు గుర్తింపు లేకుండా నడుస్తున్నాయి. విద్యార్థుల నుంచి అడ్మిషన్లు సైతం తీసుకున్నాయి. మొత్తం కాలేజీల్లో 25శాతం కాలేజీలు ఇప్పటి వరకు గుర్తింపును దక్కించుకోలేకపోయాయి. సగం విద్యాసంవత్సరం ముగిసినా వాటిపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్‌బోర్డు మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు 20తో ముగిసింది. నేడో, రేపో ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ సైతం విడుదలకానుంది. గుర్తింపు ఉన్న కాలేజీల్లోని విద్యార్థుల నుంచే పరీక్ష ఫీజులు తీసుకుంటారు. దీంతో ఈ కాలేజీల్లో చదువుతున్న 50వేలకుపైగా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే గుర్తింపు లేని కాలేజీలు అత్యధికంగా ఉన్నా వీటిని నియంత్రించలేకపోతున్నది. కనీసం ఈ కాలేజీలకు నోటీసులు కూడా జారీచేయలేదంటే బోర్డు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.