శామీర్పేట, జూలై 12: భారత న్యాయవ్యవస్థ ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదని, కొన్నిసార్లు కేసు విచారణ దశాబ్దాలపాటు కొనసాగుతున్నదని భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. విద్యార్థులు స్కాలర్షిప్ల ఆధారంగా విదేశాలకు వెళ్లి చదువుకోవాలని తల్లిదండ్రులపై భారం వేయకూడదని చెప్పారు. హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీలో శనివారం జరిగిన 22వ స్నాతక్సోవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ, రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ చాన్స్లర్ జస్టిస్ సుజయ్ పాల్, నల్సార్ వైస్ చాన్స్లర్ శ్రీకృష్ణదేవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాద పట్టా పుచ్చుకున్న పట్టభద్రులనుద్దేశించి జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. కొన్ని కేసుల్లో ఓ వ్యక్తి కొన్నేండ్ల పాటు జైలు జీవితం గడిపిన తరువాత నిర్దోషిగా రుజువు కావడం చూస్తున్నామని చెప్పారు. మనకున్న ఉత్తమ ప్రతిభతోనే సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా జడ్జి జెడ్ ఎస్ రాకఫ్ రాసిన ఓ పుస్తకంలోని మాటలను ప్రస్తావిస్తూ.. ‘మన న్యాయవ్యవస్థను బాగు చేయాల్సి ఉన్నదని నేను నమ్ముతున్నప్పటికీ.. నా తోటి పౌరులు ఈ సవాలును ఎదుర్కోవడానికి సిద్ధపడతారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. దేశంలోని చివరి, అత్యంత పేదవాడికి న్యాయం అందేలా చూడాలని చెప్పారు.
వృత్తిని ప్రేమిస్తే సత్ఫలితాలు
వృత్తిని, చేసే పనిని ప్రేమించినప్పుడే సత్ఫలితాలు వస్తాయని జస్టిస్ బీఆర్ గవాయ్ చెప్పారు. న్యాయవాద వృత్తి ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, న్యాయవాదులు నిరంతరం తమను తాము నిరూపించుకోవాలని సూచించారు. కేవలం ఉన్నత నైపుణ్యాలు ఉంటే సరిపోదని, సృజనాత్మకత, నిర్మాణాత్మక కార్యాచరణతోనే వృత్తిలో రాణించడం సాధ్యమవుతుందని చెప్పారు. విదేశాల్లో చదువుల కోసం రూ.60 లక్షల -80 లక్షల వరకు అప్పులు చేసి వెళ్లే విద్యార్థులు బాధ్యతలను విస్మరించకూడదని హితవు చెప్పారు. ఏ పొరపాటు జరిగినా అయినవాళ్లు అప్పుల ఊబిలో కూరుకుపోతారని హెచ్చరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ వాసంతి, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
సమానత్వ సాధనే రాజ్యాంగం లక్ష్యం
ఉస్మానియా యూనివర్సిటీ: సమానత్వ సాధనే బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ లక్ష్యమని సీజేఐ జస్టిస్ గవాయ్ చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ‘కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా: ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే నేరుగా భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్లో పేర్కొన్నారని గుర్తుచేశారు. గత 75 ఏండ్లుగా దేశాన్ని పటిష్ఠంగా, ఐక్యంగా ఉంచడంలో రాజ్యాంగం పోషించిన పాత్ర అమూల్యమైనది అని చెప్పారు.
రాజ్యాంగం ఎక్కువగా సమాఖ్యసంబంధమైనదిగా, కేంద్రీకృతమైనదిగా ఉన్నదని కొందరు అంబేద్కర్ను విమర్శించారని అన్నారు. ఈ విమర్శలను అంబేద్కర్ తిప్పికొడుతూ..‘రాజ్యాంగం సమాఖ్యసంబంధమైనదిగా లేదా కేంద్రీకృతమైనదిగా లేదు కానీ యుద్ధం, శాంతి సమయాల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచే రాజ్యాంగాన్ని దేశానికి అందిస్తున్నాము’ అని చెప్పారని చీఫ్ జస్టిస్ గుర్తుచేశారు. రాజకీయ న్యాయంతోపాటు ఆర్థిక, సామాజిక న్యాయాన్ని సాధించేందుకు రాజ్యాంగ నిర్మాతలు పెట్టుకున్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కంకణబద్ధులమై ఉండాలని పిలుపునిచ్చారు.