నారాయణఖేడ్, జనవరి 29: మధ్యాహ్న భోజనం వికటించి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. పాఠశాలలో 47 మంది విద్యార్థులు ఉండగా, గురువారం 43 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు కడుపు నొప్పి, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
22 మంది విద్యార్థులను నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించారు. బుధవారం గ్రామంలో ఒకరి ఇంట్లో విందు ఏర్పాటు చేయగా, మిగిలిన ఆహార పదార్థాలను మధ్యాహ్న భోజనం పెట్టడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తల్లిదండ్రులు ఆరోపించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్‌రెడ్డి ఏరియా దవాఖానను సందర్శించి పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు.
మెరుగైన వైద్యం అందించి విద్యార్థులు త్వరగా కోలుకునేలా చూడాలని దవాఖాన సూపరింటెండెంట్ రమేశ్‌ను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విమర్శించారు. దవాఖానలో విద్యార్థుల పరిస్థితిపై ఆరాతీసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులకు కమీషన్ల యావ తప్ప ప్రజల సంక్షేమం పట్టదని మండిపడ్డారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.