సూర్యాపేట టౌన్, జూన్ 10: రైతులకు నకిలీ పత్తి విత్తనాలను అంటగడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.65 లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. మంగళవారం డీపీవోలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఈనెల 9న ఆత్మకూర్.ఎస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాతర్లపహాడ్ స్టేజీ వద్ద సీసీఎస్, ఆత్మకూర్.ఎస్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేస్తుండగా బైక్‌పై అటుగా వచ్చిన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన తండా నగేశ్ వద్ద సోదా చేయగా 120 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు లభించినట్టు ఎస్పీ తెలిపారు.
ఇతను ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన పంది రాములు వద్ద నుంచి విత్తనాలు తెస్తున్నట్టు అంగీకరించినట్టు చెప్పారు. ఈ కేసులో నగేశ్‌తోపాటు రాములు, బానోత్ జయరాం, గుంటూరు బాలాజీనగర్‌కు చెందిన తరిగొప్పుల శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కాగా మోతె మండలం రావిపహాడ్‌లో వెలుగు శ్రీను నివాసంలో అడ్వాన్స్ 333, అరుణోదయ కంపెనీ పేర్లతో ఉన్న 98 నకిలీ పత్తి విత్తనాలు గుర్తించి సీజ్ చేసినట్టు చెప్పారు. నిందితుడిని విచారించగా తనకు బంధువైన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చర్లపల్లి శాతవాహనతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఈ విత్తనాలు అమ్ముతున్నట్టు వెల్లడైందని అన్నారు. నిందితుడు శ్రీనును అరెస్టు చేసి రూ.2లక్షల విలువైన నకిలీ విత్తనాలు సీజ్ చేశామన్నారు. శ్రీనుతోపాటు శాతవాహనను అరెస్ట్ చేసినట్టు చెప్పారు.