హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రజలకు ధైర్యం చెప్తూ అండగా నిలవాల్సిన కొందరు పోలీసులు అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉద్యోగ ఒత్తిళ్లకు తోడు, వ్యక్తిగత పరిస్థితులు బాధించడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రేమ వైఫల్యంతో కొందరు, కుటుంబ సమస్యలతో మరికొందరు తనువు చాలిస్తున్నారు. ఇలా తెలంగాణలో కేవలం 14నెలల్లో 22 మంది కానిస్టేబుళ్లు, ఎస్ఐ, సీఐలు ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసుశాఖలో ఆందోళన వ్యక్తమవుతున్నది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 14 నెలల్లో ముగ్గురు ఎస్సైలు, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు, 14 మంది కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.
ఉద్యోగ ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు
రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహించాల్సి వస్తున్నందున మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబాలు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. వీటికి తోడు చాలీచాలని జీతంతో కుటుంబ నిర్వహణ కూడా భారంగా మారిందని కొందరు వాపోతున్నారు. తీవ్రమైన ఒత్తిడి మధ్య పని చేస్తున్నప్పటికీ.. ఊరట కల్పించే వాతావరణం లేదని ఆవేదన చెందుతున్నారు. పైగా కొందరు అధికారుల వేధింపులతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి.
బంధం.. బాధ్యతారాహిత్యం.. బలవన్మరణం
కుటుంబ కలహాలతో కొందరు పోలీసులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు ప్రేమ, వివాహేతర సంబంధాలతో తనువు చాలిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ (29) గత డిసెంబర్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు. ఎస్ఐ హరీశ్ నిశ్చితార్థానికి ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతి బ్లాక్మెయిల్ చేయడమే కారణమని పోలీసులు చెప్తున్నారు. కామారెడ్డి జిల్లా భికనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట పీఎస్ కానిస్టేబుల్ శృతి మృతి తీవ్ర కలకలం సృష్టించింది. మరికొందరు బాధ్యత మరచి చిక్కుల్లో పడుతున్నారు.
మనోధైర్యం నింపే కౌన్సెలింగ్ ఎక్కడ?
వరుస ఆత్మహత్యలు నమోదవుతున్నా సిబ్బందిలో ధైర్యాన్ని నింపేందుకు చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలున్నాయి. కౌన్సెలింగ్ ఇప్పించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎస్సై శ్రీరాములు తన ఇబ్బందులను సీఐకి చెప్పినా పరిషరించకపోగా, సూటిపోటి మాటలతో వేధించారని తెలిసింది.
14 నెలల్లో ఆత్మహత్య చేసుకున్న పోలీసులు