బిచ్కుంద, ఆగస్టు 25 : మధ్యాహ్న భోజనం వికటించి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకున్నది. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం ప్రకారం.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వడ్డించారు. ఉడికీ ఉడకని అన్నంతో మిల్మేకర్ కూరతో భోజనం వడ్డించారు. అన్నం తిన్న గంట తర్వాత 22 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. గమనించిన ఉపాధ్యాయులు హుటాహుటిన బిచ్కుంద ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఆందోళనకుగురైన విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి దవాఖానకు రాగా, తల్లిదండ్రులు, గ్రామస్థులు సమస్యలు ఏకరవు పెట్టారు. పాఠశాలకు సరఫరా చేసే బియ్యంలో పురుగులు వస్తున్నాయని తెలిపారు. సరైన నీటి సౌకర్యం లేక మిషన్ భగీరథ నీటితో మధ్యాహ్న భోజనం వండుతున్నారని, ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రంగు మారి వస్తున్నాయని తెలిపారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీని మార్చాలని సబ్‌కలెక్టర్ డీఈవో రాజును ఆదేశించారు. అనంతరం విద్యార్థులను పరామర్శించారు. వారికి మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
హైదరాబాద్, ఆగస్టు25 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, మరణాలు, ఫుడ్‌పాయిజన్ ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నిలదీసినా సర్కారులో చలనం రావడం లేదు. గురుకులాల్లో వరుస ఘటనలపై నివేదిక ఇవ్వాలని కోరినా సర్కారు స్పందించకపోవడంతో కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. గురుకులాల్లో ఘటనలపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆ కథనం ఆధారంగా మంచిర్యాల జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త నయీంపాషా జాతీయ మానవ హకుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై ఎన్హెచ్ఆర్సీ హైదరాబాద్‌లో గత నెల 28వ తేదీన విచారణ చేపట్టింది.
విచారణకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి హాజరుకాగా, విద్యార్థుల ఆత్మహత్యలు, ఫుడ్‌పాయిజన్ తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలేంటని కమిషన్ ప్రశ్నించింది. అయితే గురుకులాల్లో మెనూ మార్చడంతోపాటు, డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని, టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నదని కార్యదర్శి వివరించారు. ఇందుకు సంబంధించిన నివేదికను 4వారాల్లో సమర్పించాలని ఆదేశించింది. అయితే ఇప్పటికీ నివేదిక అందకపోవడంతో కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్వరం నివేదికను సమర్పించాలని ఆదేశించింది.