Telangana | హైదరాబాద్, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ) : గత సంవత్సరం (2023-24) ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. వానకాలం, యాసంగి సీజన్లలో కలిపి 168 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసిన తెలంగాణ దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి ధాన్యం ఉత్పత్తి తుది అంచనాలను కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసింది. తెలంగాణ అత్యధికంగా 168.74 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి తొలి స్థానంలో నిలిచినట్టు వెల్లడించింది. 159.9 లక్షల టన్నులతో యూపీ రెండో స్థానంలో, 156.87 లక్షల టన్నులతో పశ్చిమబెంగాల్ మూడో స్థానంలో నిలిచాయి. పంజాబ్ 143.56 లక్షల టన్నులతో నాలుగో స్థానంలో నిలవగా, 97.03 లక్షల టన్నులతో ఛత్తీస్గఢ్ ఐదో స్థానంలో నిలిచినట్టు వెల్లడించింది. అయితే, తెలంగాణలో కేంద్రం వెల్లడించిన 168.74 లక్షల టన్నులకు మించి ధాన్యం ఉత్పత్తి అయినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. నిరుడు రాష్ట్రంలో వానకాలంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, యాసంగిలో 50.69 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ విధంగా నిరుడు మొత్తం మీద రెండు సీజన్లలో కలిపి 1.15 కోట్ల ఎకరాల్లో వరి సాగైంది. సగటున ఎకరాకు 22 క్వింటాళ్ల చొప్పున ధాన్యం ఉత్పత్తిని అంచనా వేసినా, 2.53 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెప్తున్నారు. కేంద్రం వెల్లడించిన అంచనాల కంటే ఇది 85 లక్షల టన్నులు అధికం. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో దేశంలో మరే రాష్ర్టానికి అందనంత ఎత్తులో ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, కేసీఆర్ అమలు చేసిన వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలు నేడు తెలంగాణను దేశ వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిపాయి. కేసీఆర్ అవలంభించిన వ్యవసాయరంగ అనుకూల విధానాలతో గడిచిన ఐదేండ్లుగా తెలంగాణ రాష్ట్రం వరి సాగులో దూసుకెళ్తున్నది. ఒక ఏడాదికి మించి మరో ఏడాది సాగు పెరుగుతూ పోయింది. తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలో 35 లక్షల ఎకరాల్లో వరి సాగైతే, ఇప్పుడు 1.21 కోట్ల ఎకరాలకు పెరిగింది. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన నాటినుంచి తెలంగాణ రాష్ట్రం పంటల సాగులో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. 2019-20 నుంచి వరి సాగులో గణనీయమైన వృద్ధి నమోదైంది. 2018-19 వరకు ఏనాడూ 50 లక్షల ఎకరాలు దాటని వరి సాగు విస్తీర్ణం 2019-20లో తొలిసారిగా 80 లక్షల ఎకరాలకు ఎగబాకింది. ఆ తర్వాత 2020-21లో 1.06 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఆ తరువాత వరిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షల కారణంగా 2021-22లో కాస్త తగ్గి 98 లక్షల్లో ఎకరాల్లో సాగు అయింది. అయితే, ఆ మరుసటి ఏడాది 2022-23లో ఉమ్మడి ఏపీ, తెలంగాణలో ఎప్పుడూ సాగుకాని రీతిలో రికార్డు స్థాయిలో 1.21 కోట్ల ఎకరాల్లో వరి సాగైంది. నిరుడు 2023-24లో 1.15 కోట్ల ఎకరాల్లో సాగైంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం వరి సాగు విషయంలో రికార్డులపై రికార్డులు నెలకొల్పుతూ దేశానికి ఆదర్శంగా నిలిచింది.
రైతులు వరి సాగులో రికార్డులు బద్దలు కొడుతుంటే.. నాటి కేసీఆర్ సర్కారు ధాన్యం కొనుగోళ్లలోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ‘ఎంత పండిస్తారో పండించండి.. పంట మొత్తం కొంటాం..’ అనే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో 24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు 1.30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసే స్థాయికి ఎదిగింది. రాష్ట్ర ఏర్పాటు తొలి నాళ్లతో పోల్చితే ధాన్యం కొనుగోళ్లు ఐదు రెట్లు పెరగడం గమనార్హం. రైతులు పెద్ద మొత్తంలో ధాన్యం పండించినప్పటికీ, వారి ఎలాంటి ఇబ్బంది రాకుండా మద్దతు ధరకు కొనుగోలు చేసింది. రైతులకు ఆర్థిక భరోసా కల్పించింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా నిలిచింది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో అస్తవ్యస్తంగా, అత్యంత దయనీయంగా ఉన్న తెలంగాణ వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ గాడిలో పెట్టారు. వ్యవసాయరంగానికి, రైతులకు ప్రధాన ప్రతిబంధకాలైన సాగునీళ్లు, కరెంట్, పెట్టుబడి గోసను తీర్చడంపై దృష్టి పెట్టారు. దేశంలో మరెక్కడా లేని విధంగా 24 గంటలపాటు వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తుకు శ్రీకారం చుట్టారు. రైతులకు పెట్టుబడి గోస తీర్చేందుకు రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టి ఎకరాకు రూ.10 వేలు అందజేశారు. సాగునీళ్ల గోస తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఈ విధంగా సాగుకు ఎదురయ్యే ప్రధాన సమస్యలను తీర్చడంతో తెలంగాణలో వ్యవసాయరంగానికి ఢోకా లేకుండా పోయింది. ఏటేటా పంటల సాగు పెరిగింది. అతి కొద్ది సమయంలోనే తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి అన్నపూర్ణగా ఎదిగింది.