TGSRTC | హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో బ్రెడ్ విన్నర్ (కారుణ్య నియామకం) ద్వారా ఎంపికైన సుమారు 2 వేల మంది ఉద్యోగులు తమ పోస్టుల రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి తమకు అన్యాయం జరుగుతున్నదని, ఈ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
బ్రెడ్ విన్నర్, మెడికల్ ఇన్వ్యాలిడేషన్ స్కీమ్‌ల కింద నియమితులైన వారిని తక్షణం క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు. ఈ పథకం ద్వారా నియమితులైన డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు, కానిస్టేబుళ్ల లాంటి చిరుద్యోగుల పట్ల ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నిర్దయగా వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. 2023-2025 కాలంలో కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రారంభమైందని ఉద్యోగులు తెలిపారు. ప్రస్తుతం తమను కాంట్రాక్టు ఏకీకృత వేతన ప్రాతిపదికన మూడేండ్ల కాలానికి నియమించారని, తమకు ఇస్తున్న రూ.20,600 వేతనం కుటుంబ ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియామకాల్లో జాప్యం కారణంగా కొన్నేండ్లపాటు సర్వీసు కోల్పోయినప్పటికీ ఇప్పుడు కాంట్రాక్టు ప్రాతిపదికన తమను రిక్రూట్ చేసుకోవడం అన్యాయమని వాపోతున్నారు.
గతంలో తమ సమస్యలను ఆర్టీసీ ఎండీకి విన్నవించినా నేటికీ పరిషారం కాలేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. 2013లో మరణించిన ఓ కండక్టర్, 2014లో మరణించిన ఓ డ్రైవర్ వారసులు ఇప్పటికీ ఏకీకృత వేతనంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. 2018లో మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కుమారుడిని 2019లో రెగ్యులర్ ప్రాతిపదికన నియమించారని గుర్తుచేస్తూ.. తాము చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. తమను అలాగే వదిలేసి టీఎస్ఎల్పీఆర్బీ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ చేపట్టడం ఎంతవరకు న్యాయమని నిలదీస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు ప్రత్యక్ష నియామకాలు కొనసాగుతున్నప్పటికీ, తమను కాంట్రాక్టు ఉద్యోగులుగా పరిగణించడం అన్యాయమని, తమను రెగ్యులరైజ్ చేసే వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. తక్షణం కారుణ్య నియామకాల ద్వారా నియమతులైన వారికి ఉద్యోగ భద్రత కల్పించి, రెగ్యులర్ చేయాలని నూతన ఎండీని కోరుతున్నట్టు తెలిపారు.