హైదరాబాద్, జూన్ 11(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో స్కూళ్ల రీ ఓపెనింగ్ తేదీని ఈ నెల 12నుంచి 15వ తేదీకి మార్చడం వెనుక రూ.2వేల కోట్ల స్కామ్ ఉన్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. గురుకుల పాఠశాలల్లో యూనిఫామ్స్, బూట్ల సరఫరా ఇంకా పూర్తికాలేదని, వాటి కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినందుకే తేదీని వాయిదా వేశారని చెప్పారు. కేసీఆర్ హయాంలో స్థానిక చేనేత కార్మికులకు యూనిఫామ్ టెండర్లు ఇచ్చేవారని, బూట్లు, బెల్టు కొనుగోలు టెండర్లను లిడ్‌క్యాప్‌కు ఇచ్చేవారని గుర్తుచేశారు. ఈసారి ప్రభుత్వం కమీషన్ల కోసం గుజరాత్ కంపెనీకి కట్టబెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై పన్నుల భారం వేస్తూ, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం తన షోకులకు వందల కోట్లు తగలేస్తున్నారని తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖజానా ఖాళీ అంటూనే జూబ్లీహిల్స్‌లో రూ.100 కోట్లతో కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం తన సొంత లబ్ధి, కమీషన్ల కోసం రాష్ట్రం పరువు తీస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూముల విలువ, వాహనాల పన్ను, పరీక్ష ఫీజులు, ఆర్టీసీ చార్జీలు, మద్యం ధరలు పెంచి.. ‘పెంచుడు.. దంచుడు’ అన్నట్టుగా పాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను చెల్లని రూపాయి అంటున్న రేవంత్‌రెడ్డికి, కేసీఆర్ పేరు తలువకపోతే పూట గడువదని, రేవంత్‌రెడ్డిని నిద్రపోకుండా చేస్తున్నదని కూడా బీఆర్ఎస్ పార్టీయేనని పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో గురువారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పలు సంచలన విషయాలను బయటపెట్టారు. పాఠశాలల పునః ప్రారంభాన్ని జూన్ 12 నుంచి 15కు మార్చడం వెనుక పెద్ద సామ్ దాగి ఉన్నదని విమర్శించారు. గురుకుల విద్యార్థుల యూనిఫారం టెండర్లను స్థానిక చేనేత కార్మికులు, లిడ్క్యాప్నకు ఇవ్వకుండా కమీషన్ల కోసం గుజరాత్ కంపెనీకి కట్టబెట్టారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్ఆర్ పరిధిలో జీవో 111ను ఎత్తివేయాలని చూస్తున్నదని, రాష్ట్రంలోని భూ మాఫియా లబ్ధి కోసమే ఆగమేఘాలపై ఈ ఫైల్‌ను ముందుకు తీసుకెళ్తున్నదని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. దీని వెనుక అతిపెద్ద కుంభకోణం ఉన్నదని, త్వరలో పూర్తి వివరాలు బయటపెడ్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో కమీషన్ల రాజ్యం నడుస్తున్నదని, అవి లేనిదే పనులు జరుగడం లేదని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. అంగన్వాడీలకు సరఫరా చేసే కోడిగుడ్ల టెండర్లలోనూ అడ్డగోలుగా కమీషన్లు వసూలు చేయడం దారుణమని, దీన్ని దేవుడు కూడా క్షమించడని హెచ్చరించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో లక్షా 25వేల మంది విద్యార్థులు తగ్గారని, విద్యాశాఖ మంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపాలనలో విద్యాశాఖ తిరోగమనంలో పయనిస్తున్నదని మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని ప్రతిపక్షంలో ఉన్నపుడు డిమాండ్ చేసిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడెందుకు తగ్గించడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.2వేల కోట్ల వరకు పెరిగిందని, వ్యాట్ రూపంలో అదనంగా రూ.2 వేల కోట్లు సమకూరుతున్నాయని తెలిపారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాక పన్నులు, భూముల రిజిస్ట్రేషన్ విలువ, వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలు, వాహన పన్నులు, ఆర్టీసీ చార్జీలు, బీర్లు, మద్యం ధరలు పెంచారు.. నిరుద్యోగుల పరీక్ష ఫీజులను డబుల్ చేశారు.. మున్ముందు భూమిశిస్తు కూడా తెస్తామంటున్నారు.. రేవంత్ పాలన సాగుతున్నది’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఫ్యూచర్‌సిటీలో ఇంపాక్ట్ ఫీ వసూలు చేస్తామని చెప్పి ప్రభుత్వం రూ.10వేల కోట్ల అప్పు తెచ్చిందని హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌కు అప్పులు ఇప్పించిన బ్రోకర్‌కు రూ.100 కోట్లను కమీషన్‌గా చెల్లించారని, ముంబైకి చెందిన ఆ బ్రోకర్ ఇప్పుడు ఏకంగా విమానమే కొన్నాడని పేర్కొన్నారు.
ఫ్యూచర్‌సిటీ ఏర్పాటుచేయడం సాంకేతికంగా అసలు సాధ్యమే కాదని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసి తీరుతామని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. ఫార్మాసిటీకి నిబంధనల మేరకు రైతులు వేల ఎకరాలు ఇచ్చారని, తాను కూడా వ్యక్తిగతంగా ఫార్మాసిటీ అభివృద్ధి కోసం తన 17ఎకరాల భూమిని ఇచ్చానని గుర్తుచేసుకున్నారు.
ఫ్యూచర్‌సిటీలో భూములు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి జర్నలిస్టులను మోసం చేస్తున్నారని విమర్శించారు. వివాదాలు లేని నిజాంపేట, పేట్‌బషీరాబాద్ భూములను ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్పై కేసు పెండింగ్‌లో ఉన్నదని బీజేపీకి ఉప్పందించిందే తెలంగాణ కాంగ్రెస్ వాళ్లని సాక్షాత్తు మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రే చెప్పారని, మరి లీక్ ఎవరు చేశారన్నదానిపై సిట్, జ్యుడీషియల్ దర్యాప్తు చేయిస్తారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్జికే అన్యాయం చేసిన పార్టీ.. రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తుందని నిలదీశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశించి భంగపడ్డ వ్యక్తే లీక్ చేసినట్టు తెలుస్తున్నదని, దీనిపై వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
‘రైతులకు బోనస్ ఇవ్వరు.. రైతుభరోసా డబ్బులు ఇవ్వరు.. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వరు కానీ రూ.100కోట్ల ప్రజల సొమ్ముతో బోధి పెవిలియన్ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లో కొత్త క్యాంపు ఆఫీసు కట్టించుకున్నారని హరీశ్‌రావు విమర్శించారు. రూ.7 కోట్లతో వీఐపీ గెస్ట్‌హౌస్ కడ్తామని చెప్పి జీవో ఇచ్చి ఇప్పుడు రూ.70కోట్లు ఖర్చు చేశారని, ఫైనల్ బిల్లు తర్వాత అది వంద కోట్లు దాటుతుందని ఆరోపించారు. ఇప్పటికే సెక్రటరియేట్, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, అసెంబ్లీ, శాసనమండలి, ఎంసీహెచ్ఆర్డీ, ఫ్యూచర్‌సిటీలో.. ఇలా అనేక చోట్ల సీఎంకు ప్రత్యేకంగా కార్యాలయాలుండగా మళ్లీ కొత్త క్యాంపు ఆఫీసు కట్టాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు. ఈ క్యాంపు ఆఫీస్ వద్దనే రూ.10 కోట్ల సింగరేణి కార్మికుల సొమ్ముతో ఫుట్‌బాల్ గ్రౌండ్ కూడా కట్టారని గుర్తుచేశారు. ప్రగతిభవన్ వద్ద కంచెలు తొలగించామని ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. తన కొత్త క్యాంప్ ఆఫీస్ చుట్టూ రూ.17కోట్లతో ఇనుప కంచెలు ఎందుకు పెట్టారని నిలదీశారు. సీఎం తీరు చూస్తుంటే చదువు చారెడు బలుపాలు దోశెడు అన్నట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు.