నాగర్‌కర్నూల్, జూన్ 18 : గురుకులాల టెండర్లలో కుంభకోణం జరిగిందని, అందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. స్కామ్‌పై సమాధానం చెప్పాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రులను మీడియా ముందుకు తీసుకొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడిస్తున్నాడని మండిపడ్డారు. లేకలేక మంత్రి అయిన లక్ష్మణ్‌కుమార్‌తో అబద్ధాలు చెప్పిస్తున్నారని విమర్శించారు. గురువారం నాగర్‌కర్నూల్‌లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘రూ.2 వేల కోట్ల స్కామ్ జరిగినట్టు మా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఈ విషయాన్ని నిరూపించేందుకు ఎక్కడికైనా వస్తాం.. మీ సీఎంను తీసుకొని రావాలి’ అని మంత్రి లక్ష్మణ్‌కు సవాల్ విసిరారు.
తాము అడిగే ప్రశ్నలను ముందుగానే బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జీవో 17ను తీసుకొచ్చి ఢిల్లీ, ముంబై సేట్లకు దోచి పెడుతున్నారని దుయ్యబట్టారు. మఫత్‌లాల్ అనే కాంట్రాక్టర్‌కు తెలంగాణ పేదల సొత్తును దోచిపెడుతున్నారని విమర్శించారు. యూనిఫారాలు తయారు చేసేవాడికి గురుకులాలకు అవసరమయ్యే అన్ని కాంట్రాక్టులు ఇచ్చి దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఇచ్చిన కాంట్రాక్టులు తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ బిడ్డలకు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇదిచాలదన్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ముందుకేశారని ధ్వజమెత్తారు.
కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు తామంతా ప్రజల గొంతుకగా ఉండి కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న వరుస కుంభకోణాలను బయటపెడితే జీర్ణించుకోలేని రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడటం తగదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ‘స్కామ్‌ల గురించి ప్రశ్నిస్తున్నందుకు.. మమ్మల్ని బాడీషేమ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం దారుణం. మీలాగ మాట్లాడేందుకు కేసీఆర్ మాకు ఇలాంటి భాష నేర్పించలేదు’ అని స్పష్టంచేశారు. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రయోగాత్మకంగా మొదలు పెట్టేందుకు వచ్చిన రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ నేతలపై నీచంగా మాట్లాడటంపై మండిపడ్డారు.
సీఎంగా రేవంత్‌రెడ్డి భాష వికృతంగా ఉంటుందన్న విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందేనని, ఆ సమయంలో అక్కడి పిల్లలు అసౌకర్యంగా ఆయన సంభాషణ విన్నారని తెలిపారు. ఇప్పటికైనా హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని సీఎం రేవంత్‌కు సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఓటరు నమోదు నియోజకవర్గ ఇన్చార్జి జహంగీర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.