హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యా సంస్థలకు అవసరమై న సరుకుల సరఫరా టెండర్లలో రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. జీవో-17 ద్వారా స్థానిక చిన్న కాంట్రాక్టర్ల కడుపులు కొట్టి, జాతీయ సంస్థలకు టెండర్లలో అవకాశం కల్పించారని విమర్శించారు. బడా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకొనేందుకే నిబంధనలు మార్చారని ఆరోపించారు. ఢిల్లీకి మూటలు పంపేందుకే జీవో-17ను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బూట్లు, స్కూల్‌బ్యాగ్‌లు, ట్రంక్‌పెట్టెలు, బెల్ట్‌ల సరఫరాకు సంబంధించిన టెండర్లలో పాల్గొనాలంటే, రూ.10 కోట్ల నుంచి రూ.25 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికెట్ తేవాలంటూ కాంట్రాక్టర్లకు షరతులు పెట్టారని పేర్కొన్నారు. నోట్‌బుక్స్‌కు వాటర్‌మార్క్ నిబంధన పెట్టారని, అదేమైనా జాతి భద్రతకు సంబంధించిన విషయమా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో విద్య, మైక్రో ఇండస్ట్రీస్‌కు న్యాయం
సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో విద్య, మైక్రో ఇండస్ట్రీస్ వంటి అన్ని రంగాల్లోనూ సామాజిక న్యాయం జరిగిందని పేర్కొన్నారు. 12 వేల మంది చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లకు కేసీఆర్ న్యాయం చేశారని వివరించారు. ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42%, ఎస్సీలకు 18%, గిరిజనులకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చలేదని విమర్శించారు. స్థానికంగా ఉన్న చిన్న కంపెనీలను దెబ్బ కొట్టి, తమ అస్మదీయ కంపెనీలకు విద్యారంగ కాంట్రాక్టులు ఇచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, గిరిజన, మైనారిటీ కార్పొరేషన్లకు టెండర్లలో ఎందుకు అవకాశం ఇవ్వలేదని నిలదీశారు. జీవో-17ను మార్చాలని హైకోర్టు చెప్పినప్పటికీ.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో చెప్పిన సామాజిక న్యాయం ఇదేనా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు అభ్యంతరాలు చెప్పాలనుకున్నా డీడీలు కట్టాలనే విచిత్రమైన నిబంధనలు పెట్టారని ఆరోపించారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
ప్రొక్యూర్మెంట్ పాలసీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. కర్ణాటకలో మాదిరిగా ప్రొక్యూర్మెంట్ పాలసీలో ఎస్సీలకు 18% రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అక్కడి పరిశ్రమలకే ప్రొక్యూర్మెంట్ అవకాశం కల్పించారని వివరించారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవో-17ను రద్దు చేసి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయాన్ని విస్మరించడంపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని చెప్పారు. పేదల పొట్టకొట్టే విధానాలను ప్రభుత్వం మానుకోవాలని హితవు చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నేత అబ్రార్ హుస్సేన్ ఆజాద్ పాల్గొన్నారు.